ఆస్ట్రేలియా : ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థిపై దాడి జరగడంతో ఆ విద్యార్థి కోమాలోకి వెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. అయితే ఈ ఘటనకు కారకుడైన వ్యక్తి డిసెంబర్ 4వ తేదీన కోర్టులో హాజరుకానున్నాడు.
నివేదిక ప్రకారం … బాధిత విద్యార్థి (20) ఆస్ట్రేలియాలోని తాస్మానియా విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నాడు. నవంబర్ 5న తాస్మానియాలోని ఓ ప్రాంతంలో బెంజమిన్ డాడ్జ్ కాలింగ్స్ (25) అనే యువకుడు, భారత విద్యార్థి పై తీవ్రంగా దాడి చేశాడు. ఈ దాడిలో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. దాడిలో విద్యార్థి కుడి ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయని, ఈ దాడి విద్యార్థి మెదడుపై కూడా ప్రభావం చూపిందని డాక్టర్లు తెలిపారు. ఆ తర్వాత విద్యార్థికి ఆపరేషన్ చేశారు. ఈ శస్త్రచికిత్స కోసం వైద్యులకు గంటల సమయం పట్టింది. దాడికి పాల్పడిన అనుమానాస్పద వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు బెంజమిన్ డాడ్జ్ కాలింగ్స్ ఆస్ట్రేలియాలోని లీనా వ్యాలీ నివాసి అని పోలీసులు తెలిపారు. నిందితుడికి 21 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం…నిందితుడు కాలింగ్స్ కు మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. ఆ తర్వాత డిసెంబర్ 4వ తేదీన కోర్టుకు హాజరుకావాలని ఆదేశించారు. ఆ రోజు నిందితుడు తనపైన వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పాల్సి ఉంది. దాడి చేయడం, తప్పుడు చిరునామా, పేరు అందించడం, పోలీసు అధికారిని ప్రతిఘటించడం, డ్రైవింగ్ వంటి అనేక నేరాలు ఇప్పటికే కాలింగ్స్‌పై నమోదై ఉన్నాయి. నివేదిక ప్రకారం … కాలింగ్స్‌పై క్రిమినల్ కోడ్ అసాల్ట్ ఆరోపణలున్నాయి. దీనిపై నిందితుడికి గరిష్టంగా 21 సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.