60శాతానికి పైగా ఇళ్లు ధ్వంసంరోజుకు 16లక్షల డాలర్లు నష్టం
గాజా : గాజాలో గత నాలుగు రోజులుగా అమలవుతున్న కాల్పుల విరమణను మరో 48గంటలు పొడిగించారు. ఇరు పక్షాలు ఇందుకు అంగీకరించాయని మధ్యవర్తి ఖతార్ తెలిపింది. దీంతో ఇరు పక్షాల ఆధీనంలో వున్న బందీలు మరింత మంది విడుదలవుతారనే ఆశలు నెలకొన్నాయి. మరోవైపు కాల్పుల విరమణ మరింతగా పొడిగించే అవకాశాలు వుండవచ్చనే అంచనాలు, ఆశలు కూడా పెరిగాయి. దీనివల్ల గాజాలోకి మరింతగా మానవతా సాయం అందుతోంది. నాల్గవ రోజు బందీల మార్పిడిలో భాగంగా 33మంది పాలస్తీనియన్ ఖైదీలు ఇజ్రాయిల్ జైళ్ల నుండి విడుదలయ్యారు. వారు మంగళవారం తెల్లవారు జాముకు తూర్పు జెరూసలేం, వెస్ట్ బ్యాంక్ పట్టణమైన రమల్లాకు చేరుకున్నారు. మరోవైపు హమస్ విడుదల చేసిన 11మంది ఇజ్రాయిలీ మహిళలు, పిల్లలు సోమవారం రాత్రికి ఇజ్రాయిల్‌లోకి ప్రవేశించారు. వీరిని తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు రెడ్ క్రాస్ తెలిపింది. హమాస్ సైనిక సామర్ధ్యాలను అణచివేయడానికే తాము కట్టుబడి వున్నట్లు ఇజ్రాయిల్ మరోసారి ప్రకటించింది. గాజాలో 16ఏళ్ల హమాస్ పాలనకు ముగింపు పలుకుతామని చెప్పింది. క్రమిత వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయిల్ సైనికులు ఇద్దరు పాలస్తీనియన్లను చంపేశారు. ఇప్పటివరకు గాజాలో 15వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు.
తూర్పు జెరూసలేంతో సహా వెస్ట్ బ్యాంక్‌లో ఇప్పటివరకు 231మంది పాలస్తీనియన్లు మరణించారని ఐక్యరాజ్య సమితి మానవతా కార్యకలాపాల సహాయ కార్యాలయం (ఒసిహెచ్‌ఎ) వెల్లడించింది. కాల్పుల విరమణ జరగడంతో గాజాలో చోటు చేసుకున్న విధ్వంసానికి సంబంధించిన వివరాలు వెల్లడవుతున్నాయి. గాజాలో ఆరోగ్య వ్యవస్థను తక్షణమే పునరుద్ధరించని పక్షంలో మరింతమంది మరణించే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. అల్‌షిఫా అస్పత్రిలో డయాలసిస్ యూనిట్‌ను పునరుద్దరించారని, రోగులను కూడా చేర్చుకుంటున్నామని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. గాజాలో సుదీర్ఘకాలం కాల్పుల విరమణ ఆమలు చేయాలని, మొత్తంగా బందీలందరినీ విడుదల చేయాలని యుఎన్ చీఫ్ కోరారు. గాజా వ్యాప్తంగా 60శాతానికి పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయని ఐక్యరాజ్య సమితి తన కొత్త నివేదికలో తెలిపింది. ఇజ్రాయిల్ బాంబు దాడుల కారణంగా మొత్తంగా ఉత్పత్తి స్తంభించిపోయిందని, ఫలితంగా రోజుకు 16లక్షల డాలర్లు నష్టం జరిగిందని పాలస్తీనా కేంద్ర గణాంకాల బ్యూరో వెల్లడించింది. వ్యవసాయ పరికరాలు, వేలాదిగా వృక్షాలు, పొలాల విధ్వంసాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే ఈ నష్టాలు ఇంకా ఎక్కువగానే వుంటాయని బ్యూరో తెలిపింది.