నేటి నుండే కాప్‌ 28

Nov 30,2023 08:38 #Climate Changes, #Summit
cop 28 uae climate change summit

వాతావరణ మార్పులపై నేతల చర్చలు
గ్లోబల్‌ వార్మింగ్‌ అదుపే లక్ష్యం

దుబాయ్ : ఈనాడు భూగోళం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సవాళ్ళలో ఒకటైన గ్లోబల్‌ వార్మింగ్‌, వాతావరణ మార్పులను పరిష్కరించేందుకు చేపట్టాల్సిన చర్యలపై గురువారం నుండి రెండు వారాల పాటు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరిగే కాప్‌ 28 సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 70వేల మందికి పైగా ప్రతినిధులు హాజరు కానున్నారు. కాప్‌ 28 అంటే వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి ఒప్పంద చట్రపరిధి (యుఎన్‌ఎఫ్‌సిసిసి)లోని పక్షాల 28వ సమావేశం. రియో సదస్సు జరిగి, యుఎన్‌ఎఫ్‌సిసిసి ప్రారంభించిన మూడు దశాబ్దాల కాలంలో ప్రతి ఏటా ఈ పక్షాలన్నీ సమావేశమై వాతావరణ మార్పులను పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, లక్ష్యాలపై చర్చిస్తుంది. గత సమావేశం ఈజిప్ట్‌లోని షర్మ్‌ ఎల్‌ షేక్‌లో జరిగింది. వాతావరణ మార్పుల వల్ల సంభవించే నష్టానికి పరిహారం చెల్లించే నిధి ఏర్పాటుకు ఆ సమావేశంలో అంగీకారం కుదిరింది. దాన్ని పెద్ద పురోగతిగా అభివర్ణించారు. 2015లో కాప్‌ 21 జరిగింది. అందులో పారిస్‌ ఒప్పందం కుదిరింది. గ్లోబల్‌ వార్మింగ్‌ను 1.5డిగ్రీలకు పరిమితం చేయాలని అందుకు సమిష్టిగా కార్యాచరణ చేపట్టాలని కోరుతున్న ఈ ఒప్పందం చారిత్రాత్మకమైనది. దుబారులో నవంబరు 30 నుండి డిసెంబరు 12 వరకు కాప్‌ 28 సమావేశాలు జరుగుతున్నాయి. ప్రభుత్వాలు, వ్యాపారవేత్తలు, పౌర సంస్థల ప్రతినిధులు అందరూ సమావేశమై వాతావరణ మార్పులకు నిర్దిష్టమైన పరిష్కారాలను అన్వేషిస్తారు. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల సంభవించిన వాతావరణ విపత్తులు చూస్తుంటే వాతావరణ మార్పులను పరిష్కరించడం ఎంత అత్యవసరమో స్పష్టమవుతోంది. జులై మాసం ప్రపంచంలోనే అత్యంత వేడిమి గల మాసంగా నమోదైంది. గ్లోబల్‌ వార్మింగ్‌ శకం ముగిసిందని, ఇక గ్లోబల్‌ బాయిలింగ్‌ శకం వచ్చేసిందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుటెరస్‌ హెచ్చరించారు. పారిస్‌ ఒప్పందం పేర్కొంటున్న మేరకు, ప్రతి ఐదేళ్ళకోసారి దేశాలన్నీ సమావేశమై తాము తీసుకుంటున్న వాతావరణ చర్యలను చర్చించాల్సి వుంటుంది. ఈ చర్చల ఫలితాలు కొత్తగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రేరణ కలిగిస్తాయి. గ్లోబల్‌ వార్మింగ్‌ను నిలువరించేందుకు ఇచ్చిన హామీలు, నిబద్దతలను నెరవేర్చడం నుండి ఎంత మేరకు పక్కకు మళ్ళామో దుబారు సమావేశంలో చర్చించనున్నారు. ఆ రకంగా తాము చేసిన తప్పులను దిద్దుకుని, మరింత సమర్ధవంతమైన కార్యాచరణను అమలు చేసేందుకు కాప్‌ 28 కీలకమైన అవకాశాలను కలిగిస్తుందని భావిస్తున్నారు. దుబారులోని ఎక్స్‌పో సిటీలో కాప్‌ 28 సదస్సు జరుగుతోంది. ప్రధానంగా బ్లూ జోన్‌, గ్రీన్‌ జోన్‌ అని రెండు వేదికలు ఏర్పాటు చేశారు. శిలాజ ఇంధనాలన నుండి పరిశుద్ధ ఇంధన వనరులకు ఎంత త్వరగా, సమర్ధవంతంగా మారిపోతామో దానిపై లక్ష్య సాధన ఆధారపడి వుంటుంది.కాప్‌-28 సదస్సుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ హాజరుకావడం లేదని వైట్‌ హౌస్‌ తెలియజేసింది. ఆయన బదులు ఉన్నతాధికార ప్రతినిధి బృందం హాజరవుతుందని పేర్కొంది. పశ్చిమాసియాలో పరిస్థితిపై దృష్టిసారించాల్సి ఉన్నందునే బైడెన్‌ ఈ సమావేశానికి హాజరు కావడం లేదని అది వివరణ ఇచ్చింది. నెతన్యాహు హాజరు కూడా అనుమానమేనని అంటున్నారు.

➡️