37 మంది మృతి
బ్రజవిల్లె : కాంగోలో మిలటరీ స్టేడియంలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో 37 మంది మరణించారు. రిక్రూట్‌మెంట్ కోసం జరుగుతున్న కార్యక్రమానికి యువత ఎక్కువ సంఖ్యలో రావడంతో తొక్కిసలాట జరిగిందని అధికారులు చెప్పారు. ఈ కార్యక్రమం అర్ధరాత్రి వరకు ఎందుకు కొనసాగుతోందో తెలియాల్సి వుందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఓకో నిగకాలా చెప్పారు.
వెంటనే దీనిపై దర్యాప్తు చేపట్టనున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. సైన్యంలో చేరాలనుకునే యువకులు గత వారం రోజులుగా రిక్రూట్‌మెంట్ సెంటర్ల ఎదుట పొడవైన క్యూలు కడుతున్నారు. 1500 ఉద్యోగాలే ఖాళీగా వున్నాయి, కానీ రోజుకు 700మంది చొప్పున రిజిస్టర్ అవుతున్నారు. తొక్కిసలాట నుండి తప్పించుకుని బయటపడిన ఒక యువకుడు మాట్లాడుతూ, మిలటరీ స్టేడియంలో తాను సోమవారం ఉదయం నుండి క్యూలో నిలబడి వున్నానని చెప్పాడు. రిక్రూట్‌మెంట్‌కు ఇది చివరి రోజు. అందువల్లే అర్ధరాత్ర అయినా వేచి వుండాలని తమలో చాలామంది నిర్ణయించుకున్నామని ఆ వ్యక్తి మీడియాకు తెలిపారు. సుదీర్ఘ సమయం వేచి వుండడంతో చాలామందిలో అసహనం పెరిగిపోయిందని, దాంతో బలవంతంగా నెట్టుకునైనా ముందుకు వెళ్లాలని ప్రయత్నించారని, ఫలితంగా తొక్కిసలాట జరిగిందని, పెద్ద సంఖ్యలో ప్రజలు మరణించారని, పలువురు గాయపడ్డారని ఆ వ్యక్తి తెలిపారు.