సాయంత్రం 4గంటలకు బందీల విడుదల
ఏ రోజుకారోజే విడుదలయ్యేవారి జాబితా
శాశ్వత కాల్పుల విరమణకు పెరుగుతున్న డిమాండ్
గాజా : ఇజ్రాయిల్, హమస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం శుక్రవారం ఉదయం 7గంటల నుండి అమల్లోకి వస్తుందని కతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సాయంత్రం 4గంటలకు బందీల విడుదల జరుగుతుందని తెలిపింది. మొదటి విడతగా మహిళలు, పిల్లలతో కూడిన 13మంది బయటకు వస్తారని భావిస్తున్నట్లు కతార్ విదేశాంగ శాఖ ప్రతినిధి అల్ అన్సారీ వెల్లడించారు. శుక్రవారం ఉదయానికల్లా అంతా బాగా జరుగుతుందని, కాల్పులు నిలిచిపోతాయని, బందీల విడుదల కూడా ప్రారంభమవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఏ రోజుకు ఆ రోజు నిర్దిష్ట సమయంలో విడుదలయ్యే వారి పేర్లు వెల్లడిస్తారు. ఆ జాబితాను రెడ్ క్రాస్‌కు అందచేస్తారు. ఈ ప్రక్రియ అంతా ఎలా జరగాలనే వివరాలను రూపొందిస్తున్నామని, చర్చలు కొనసాగుతున్నాయని అన్సారీ తెలిపారు. బందీలను బjటకు తీసుకువచ్చే క్రమంలో ఎక్కడా ఎలాంటి హానీ జరగకుండా చూడాలని భావిస్తున్నట్లు కతార్ పేర్కొంది. పూర్తిగా కాల్పులను విరమించాలన్నది నిబంధన అని, ఎక్కడ, ఏ తరహాలో కాల్పులను పునరుద్ధరించినా అది ఒప్పందం ఉల్లంఘన కిందకే వస్తుందని అన్సారీ పేర్కొన్నారు. మానవతాసాయం అందించడం కూడా ఈ ఒప్పందంలోని భాగమేనని చెప్పారు. రఫా క్రాసింగ్ నుండి సాధ్యమైనంత త్వరగా సహాయం వస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఒప్పందం కుదిరిన మేరకు మొత్తంగా 300 ట్రక్కుల సాయం గాజాకు రావాల్సి వుంది. బందీల భద్రతకే తాము ప్రాధాన్యతనిస్తున్నామని స్పష్టం చేశారు. కాగా శుక్రవారం పాలస్తీనా ఖైదీలు ఎంతమంది విడుదలవుతారో తమకు తెలియదని తెలిపారు. మరోపక్క హమస్ చెరలోని వారి విడుదలకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదంటూ ఇజ్రాయిలీల కుటుంబ సభ్యులు తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేశారు. శాశ్వత కాల్పుల విరమణకు పెరుగుతున్న డిమాండ్‌నాలుగు రోజుల పాటు కాల్పులు విరమించేందుకు ఒప్పందం కుదిరిన నేపథ్యంలో శాశ్వత కాల్పుల విరమణకై సర్వత్రా డిమాండ్ పెరుగుతోంది. కాల్పులను శాశ్వత విరమించే వరకు వీధుల్లోనే ఆందోళనలు జరపాల్సిందిగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు పాలస్తీనా సంఘీభావ సంస్థలు, సామ్రాజ్యవాద వ్యతిరేక సంఘాలు పిలుపిచ్చాయి. శాశ్వత కాల్పుల విరమణ, గాజా దిగ్బంధనకు స్వస్తి పలకడం, ఇజ్రాయిల్‌కు అమెరికా, కెనడా, యురోపియన్ సాయం నిలిపివేయాలన్నవి ఇతర డిమాండ్లని, అవి కూడా నెరవేరేవరకు ఆందోళన సాగాలని కోరాయి. ఈ మేరకు పాలస్తీనా యూత్ మూవ్‌మెంట్, నేషనల్ స్టూడెంట్స్ ఫర్ జస్టిస్ ఇన్ పాలస్తీనా, ది పీపుల్స్ ఫోరమ్, ఆన్సర్ కొయిలేషన్, ఇంటర్నేషనల్ పీపుల్స్ అసెంబ్లీలు ఒక ప్రకటన జారీ చేశాయి.