66 మంది భారతీయులకు మంజూరు
న్యూఢిల్లీ : 2014-20 మధ్య కాలంలో 66 మంది భారతీయులు సైప్రస్ పాస్‌పోర్టులు పొందగలిగారు. మూడు నెలల నుండి ఏడాది కాలపరిమితి వరకూ వీరికి పాస్‌పోర్టులు మంజూరయ్యాయి. గోల్డెన్ పాస్‌పోర్ట్ పథకంలో భాగంగా వీరికి వాటిని మంజూరు చేశారు. సైప్రస్ పెట్టుబడి కార్యక్రమంగా పిలిచే గోల్డెన్ పాస్‌పోర్ట్ పథకాన్ని 2017లో ప్రారంభించారు. దీని ప్రకారం ఆర్థికంగా సంపన్నులైన వ్యక్తులకు సైప్రస్ పౌరసత్వం లభిస్తుంది. తద్వారా వారు ఆ దేశంలో ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు పెట్టవచ్చు. గోల్డెన్ పాస్‌పోర్ట్ పొందిన వారిలో గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ కూడా ఉన్నారు. హిండెన్‌బర్గ్ రిసెర్చ్ విచారణలో ఈయన పేరు బయటపడిన విషయం తెలిసిందే. బురప్ హోల్డింగ్స్ లిమిటెడ్ ఛైర్మన్, వ్యవస్థాపకుడు పంకజ్ ఓస్వాల్, రియల్ ఎస్టేట్ వ్యాపారి సురేంద్ర హీరానందని కూడా గోల్డెన్ పాస్‌పోర్టులు పొందారు. ఈ పథకం దుర్వినియోగం అవుతోందని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు, సందేహాస్పద స్వభావం కలిగిన వారు, రాజకీయ ప్రముఖులకు సైప్రస్ పాస్‌పోర్టులు మంజురు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ పథకాన్ని రద్దు చేశారు. 2020 నవంబర్ 1వ తేదీ నుండి దరఖాస్తుల స్వీకరణను నిలిపివేసింది. పెండింగులో ఉన్న దరఖాస్తులను మాత్రం పరిశీలించింది. 2021 జూన్ 9 నుండి ఆ పనిని కూడా ఆపేసింది. 83 మంది పేర్లను సమీక్షిస్తున్నారని, వారి పాస్‌పోర్టులు రద్దయ్యే అవకాశం ఉన్నదని తెలుస్తోంది. వీరిలో ఎక్కువ మంది అంతకుముందు రష్యా పౌరులు. వారు తప్పుడు స్టేట్‌మెంట్లు ఇచ్చినందున పాస్‌పోర్టులు రద్దు చేయవచ్చునని ఓ ఆంగ్ల పత్రిక తెలిపింది. ఎంతమంది పౌరసత్వాలు రద్దవుతాయో సైప్రస్ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించలేదు.