ముమ్మరంగా చర్చలు
రెండు దేశాల ఏర్పాటే పరిష్కారం : ఐరాస
గాజా : గాజాలో కాల్పుల విరమణను మరోసారి పొడిగించే విషయమై ముమ్మరంగా చర్చలు జరుగుతున్నాయి. ఇవి ఒక కొలిక్కి వచ్చినట్టేనని భావిస్తున్నారు. కాల్పుల విరమణ పొడిగింపునకు హమాస్ సుముఖంగానే వుంది. అయిదో విడత బందీలు, ఖైదీల విడుదలలో భాగంగా ఇజ్రాయిల్ జైళ్ళ నుండి 30మంది పాలస్తీనియన్లు, పిల్లలు విడుదల కాగా, పది మంది ఇజ్రాయిలీలను, ఇరువురు విదేశీ జాతీయులను హమాస్ విడుదల చేసింది. పలువురు రష్యన్ బందీలు బుధవారం విడుదలయ్యే అవకాశం వుందని హమాస్ అధికారులు తెలిపారు. బ్రస్సెల్స్‌లో పత్రికా విలేకరుల సమావేశంలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మాట్లాడుతూ, కాల్పుల విరమణను పొడిగించేందుకు చేయాల్సిందంతా చేస్తున్నామని చెప్పారు. ఈ ఘర్షణలు ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా వుండేందుకు, గాజా నుండి అమెరికన్లు సహా ఇతర విదేశీ జాతీయులందరూ సురక్షితంగా బయటపడేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మరోవైపు హమాస్ పొలిటికల్ బ్యూరో సభ్యుడు ఘాజి హమద్ మాట్లాడుతూ, కాల్పుల విరమణ పొడిగింపు కోసం తాము తీవ్రంగా కృషి చేస్తున్నామని చెప్పారు. సద్దుబాటు కోసం మధ్యవర్తిత్వం జరుపుతున్న ఇతర దేశాలతో కలిసి హమాస్ పనిచేస్తోందన్నారు. కాల్పుల విరమణను పొడిగిస్తే మరింత మంది బందీలను విడుదల చేసేందుకు సిద్ధంగా వున్నమన్నారు. ఖతార్, ఈజిప్ట్‌ల్లోని తమ సోదరులతో నిత్యం సంబంధాలను కలిగివున్నామని చెప్పారు.
సవాలుగా మారిన మృతదేహాల తొలగింపు
గాజాలో ఇజ్రాయిల్ విచక్షణారహితంగా బాంబు దాడులు జరిపిన వారాల తర్వాత శిథిóలాల గుట్టల్లో నుండి మృతదేహాలను తవ్వి వెలికితీయడం అత్యంత క్లిష్టంగా, పెను సవాలుగా మారిందని గాజా పౌర రక్షణ దళానికి చెందిన సభ్యుడు ఖలీల్ అబూ షమాలా వ్యాఖ్యానించారు. ఇలాంటి సంక్షోభ సమయాల్లో ఉపయోగించడానికి వీలుండే భారీ యంత్రాలు తమ వద్ద లేవని, అందువల్ల శిథిóలాలను తొలగిం చి మృత దేహాలను వెలికితీయడమే అసాధ్యమైన పనిగా మారిందని ఆయన మీడియాతో వ్యాఖ్యానించారు. అంతర్జా తీయ సమాజం వాస్తవికంగా ఇందులో జోక్యం చేసుకోకపోతే దీన్ని పూర్తి చేయడం కష్టమని అన్నారు. కనీసం7వేల మృతదేహాలు శిధిలాల్లో పడి వున్నాయని అంచనా.
రెండు దేశాల ఏర్పాటు దిశగా కదలాలి
ఈ ఘర్షణకు శాశ్వత పరిష్కారం కోసం రెండు దేశాల ఏర్పాటు దిశగా అంతర్జాతీయ సమాజం కదలాల్సి వుందని ఐక్యరాజ్య సమితి (ఐరాస)కోరింది. రెండు దేశాలకూ జెరూసలెమ్‌నే రాజధానిగా వుండాలని పేర్కొంది. ఐరాస తీర్మానాలు, అంతర్జాతీయ చట్టాలు ప్రాతిపదికగా ఈ చర్యలు తీసుకోవడం అవసరమని ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరస్ తరపున జెనీవాలోని యుఎన్ కార్యాలయం డైరెక్టర్ జనరల్ తాతియానా వాలోవయా చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. శాంతి భద్రతలతో ఇజ్రాయిల్, పాలస్తీనా పక్కపక్కనే మనుగడ సాగించాలని అభిలషించారు.
యుద్ధ నేరాలపై స్వతంత్ర దర్యాప్తు జరగాలి
జెనీవా : ఇజ్రాయిల్‌లో, ఆక్రమిత పాలస్తీనా భూభాగంలో జరుగుతున్న యుద్ధ నేరాల ఆరోపణలపై కచ్చితమైన, పారదర్శకమైన, స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని ఐక్యరాజ్య సమితి నిపుణులు బుధవారం పిలుపునిచ్చారు. ఈ సాయుధ ఘర్షణలో పౌరుల ప్రాణాలను కాపాడాలని, అంతర్జాతీయ చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని సంబంధిత పక్షాలను వారు కోరారు. స్వతంత్ర దర్యాప్తు చేపట్టే అధికారులకు అవసరమైన వనరులు అందచేయాలని, మద్దతునివ్వాలని, తద్వారా నిష్పాక్షికంగా, కూలంకషమైన దర్యాప్తులకు అవసరమైన వెసులుబాటు కల్పించాలని వారు కోరారు. ఈ దర్యాప్తులకు పూర్తిగా సహకరించాల్సిందిగా ఇజ్రాయిల్, పాలస్తీనా అథారిటీ, గాజాలోని డీ ఫ్యాక్టో అధికారులకు వారు విజ్ఞప్తి చేశారు.యుద్ధ నేరాలపై, మానవాళిపై జరుగుతున్న నేరాలు, హత్యలు, ఇతర రకాలైన హింసపై దర్యాప్తు చేయడమన్నది చట్టపరమైన ప్రాధమిక బాధ్యత అని వారు పేర్కొన్నారు.