బెర్లిన్ : భవిష్యత్తులో కృత్రిమ మేధస్సు (ఎఐ) నియమావళిపై జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం యూరోపియన్ యూనియన్ స్థాయిలో చర్చలను వేగవంతం చేస్తుందని భావిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన పత్రాలను రాయిటర్స్ ఆదివారం విడుదల చేసింది. యూరోపియన్ యూనియన్‌లోని పెద్ద, చిన్న ఎఐ ప్రొవైడర్ల కోసం మూడు ప్రభుత్వాలు పాటించవలసిన స్వచ్ఛంద కట్టుబాట్లను ఏర్పాటు చేసుకున్నాయి. యూరోపియన్ కమిషన్, యూరోపియన్ పార్లమెంట్, ఇయు కౌన్సిల్ ప్రస్తుతం ఈ కొత్త రంగంలో నిబంధనలు ఎలా ఉండాలనే దానిపై చర్చలు జరుపుతున్నాయి. ఎఐ అప్లికేషన్ భద్రత, వివక్షత ప్రమాదాలను నివారించే లక్ష్యంతోపాటు యూరోపియన్ యూనియన్‌లో ఈ కొత్త సాంకేతికత నెమ్మదించకుండా ఉండేలా పార్లమెంట్ జూన్‌లో ‘ఎఐ యాక్ట్’ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. చర్చల సమయంలో యూరోపియన్ పార్లమెంట్ ఎఐ నియమావళికి అమెరికా సహా అన్ని ఎఐ ప్రొవైడర్లు కట్టుబడి ఉండాలని ప్రతిపాదించింది. ఇవి యూరోపియన్ ప్రొవైడర్ల ప్రయోజనాలను దెబ్బతీస్తాయని ఈ మూడు దేశాలు హెచ్చరించాయి. ప్రవర్తనా నియమావళిలో పారదర్శకతకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని పేర్కొన్నాయి. మొదట్లో ఎటువంటి ఆంక్షలు విధించ కూడదని భావించాయి. డిజిటల్ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో కలిసి ఈ చర్చలకు బాధ్యత వహిస్తున్న జర్మనీ ఆర్థిక మంత్రిత్వ శాఖ, చట్టాలు, దేశం ఎఐని నియంత్రించకూడదని , దాని అప్లికేషన్‌ను మాత్రమే నియంత్రించాలని పేర్కొంది.