పశువుల మేతకు వరిపంట
ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్ : వరి సాగు ఎంతో ఆశాజనకంగా ఉంటుందని ఆశించిన రైతులకు ఈఏడాది వర్షాలు అనుకూలించకపోవడం, సాగునీటి వనరులు అందుబాటులో లేక తమ కళ్లముందే పంటలు ఎండిపోతున్నాయి. దీంతో మండలంలోని పలు గ్రామాల్లో రైతులు తమ పంటపొలాల్లోకి పశువులను తొలేస్తున్న దయానీయమైన పరిస్థితి ఎక్కడికక్కడే కనబడుతుంది. మండలంలోని ఎమ్మార్ నగరంలో రొంపిల్లి జగన్నాధం అనే రైతు ఎండిన చేలను కళ్లతో చూడలేక దగ్గర ఉండి మరీ పశువులను పొలాల్లో తోలి వాటికి మేతగా వేశారు. మండలంలో 18వేల ఎకరాల్లో వరి సాగుకు అనువైనప్పటికీ సకాలంలో వర్షాలు కురవకపోవడంతో ఈ ఏడాది కేవలం 15వేల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. దాదాపు 2వేల ఎకరాల వరకూ రైతులు వెదజల్లే పద్దతిలో విత్తనాలు జల్లుకున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌సీజన్ ప్రారంభం నాటి నుంచి వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పటికీ సెప్టెంబర్ మొదటివారం నుండి మూడో వారం వరకూ ఎడతెరపిలేకుండా కురిసిన వానలకు రైతులు ఎంతో ఆశతో వరిసాగును కొనసాగించారు. కాస్త ఆలస్యంగానైనా ఉభాలు కొనసాగించారు. అయితే సెప్టెంబర్ శివారు వారం నుంచి ఇప్పటికీ చినుకుల జాడలేకపోవడంతో తమ పంటలను కాపాడుకోలేక రైతులు చేతులు ఎత్తేశారు. నీటివనరులు ఉన్న రైతులు దిగుబడికి మించి ఖర్చు చేస్తూ డీజల్ ఇంజన్లతో దూరాబారాల నుంచి నీళ్లు తోడించుకుంటున్నారు. చెరువుల కింద, ఆయకట్ట రైతులు ఆ మాత్రం నీటితడులు ఇచ్చి పంటను రక్షించుకున్నప్పటికీ దాదాపు 30 శాతం మంది రైతుల పొలాలకు నీటికి కటకటలాడాల్సిన పరిస్ధితి. ఈ పరిస్ధితిపై వ్యవసాయ అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ధేశించిన ప్రమాణాలు ప్రకారం మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించడం కుదరదని, ఈ ఏడాది ఖరీప్ సీజన్‌కు వర్షాలు అనుకూలించక పోవడంతో పంటలు ఎండిపోవడమన్నది యధార్ధమని, మండలంలో దాదాపు 92శాతం ఇ-క్రాప్ నమోదైనందున నష్టపోయిన భూముల వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. తప్పకుండా వాటికి పరిహారం అందించి తగు న్యాయం చేస్తామంటున్నారు. ఈ ఏడాది అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని మండలానికి జీవాధారమైన జంఝావతి ఎగువకాలువ, అడారు ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులను అదుకోకపోతే భవిష్యత్తులో రైతాంగం తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు చూడాల్సి ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.