ఏ నేలమీదైనా …

Nov 27,2023 08:27 #sahityam

గెలుపెవరిదో

ఎవరు ఎవర్ని గెలిచారో

గెలుస్తారో తెలియదు

అసలు గెలవటమంటే ఏమిటో కూడా తెలియదు

ఖచ్చితంగా ఓడేది మాత్రం మేమే!

 

తల్లుల్ని కోల్పోయాం, తండ్రుల్ని కోల్పోయాం

అనాధ జీవచ్ఛావాల్లా యుద్ధభూమిలో

ఇంకెవర్ని వెతుక్కోవాలో తెలియని

దిక్కుతోచని స్థితిలో దారం తెగిన

గాలి పటాలమై తిరుగుతున్నవాళ్లం!

 

తలలు కోల్పోయి కాళ్లు కోల్పోయి

చేతులు తెగిపోయి

మా కలలు మా సావాసగాళ్ల కలలు

నిస్తేజంగా పడి వున్నాయి

రక్తమూ అనేక కన్నీళ్లతో పాటు

లేలేత మా రక్తంతో తడిసిన నేల

పచ్చి పచ్చిగా వుంది

మీరెవరు గెలిచారో, ఎవరు గెలుస్తారో

లేత పావురాలం మాకైతే తెలియదు

మా కలల రెక్కలు తుత్తునియలై

నేలంతా పరుచుకున్నాయి

 

చందమామ, చుక్కలూ, మిణుగురులూ

మా అమ్మా నాన్నలతో

మేం తిరుగాడిన పచ్చని నేలంతా

యుద్ధ రక్తం పులుముకుని

మట్టికీ దేహాలకు తేడా తెలియని

శవాల దిబ్బలా మారిపోయుంది

 

ఎవరు ఎవరికోసం పోరాడుతున్నారో

ఎవరు ఎవరి కోసం ఏం బావుకుందామని

ఇంత బీభత్సమవుతున్నారో మాకు తెలియదు

 

మాకు తెలిసిందల్లా కళ్లల్లో ఇంత ప్రేమనేసుకొని

ఇంద్రధనుస్సుల్ని, తూనీగల్ని, కలువపూలనీ

వెంటేసుకుని పచ్చని నేలనిండా

నవ్వుల పువ్వుల్ని పూయిస్తూ

కేరింతల సందళ్లయి ఎగరటమే!

 

గెలిచేదెవరో, ఓడేదెవరో

మాకు లెక్కలు తెలియవు

ఖచ్చితంగా ఓటమి మాత్రం

మాలాంటి పిల్లలదే !

 

ఆకాశమంత కలల్ని నింపుకుని

నేలంత పచ్చదనాన్ని పరుచుకుని

రేపటిని స్వప్నిస్తూ

జింకపిల్లల్లా, సెలయేటి నదుల్లా

ఏ నేలమీదైనా పరుగుపెడుతున్న

మాలాంటి పిల్లలదే ! – చిత్తలూరి 91338 32246

➡️