ఎన్నుకుందాం

Nov 18,2023 13:07 #Literature

 

రంగుల్ని చిక్కగా కలిపి
జెండాలుగా ఎగరేసేవాళ్ళని కాదు
మడతపడ్డ సగటు పేగుల చిక్కును
విడదీసేవాళ్ళని ఎన్నుకుందాం.

కాగితాల పడవలపై
నమ్మకాన్ని నడిపేవాళ్ళని కాదు
బతుకు గీతల చేతి రాతల్ని
చక్కగా లిఖించేవాళ్ళని ఎంచుకుందాం.

ఒట్టి మాటల మాటున
తొంగి చూసి నమ్మించేవాళ్ళని కాదు
చేతల్లో చేయూతని
జనంలోకి నెట్టేవాళ్ళని ఎన్నుకుందాం.

గల్లి గల్లీలో సమ్మగా గిల్లిపోతూ
ఖద్దరు కాంతుల్ని వెదజల్లేవాళ్ళని కాదు
నిస్సహాయతలో మూలన పడ్డ
సమాజాన్ని బతికించేవాళ్ళని ఎంచుకుందాం.

జోడింపుల చేతుల్తో గెలిచి
అదిలించేవాళ్ళని కాదు
అణగారిన వ్యవస్థకు
కాస్త ఊపిరందించేవాళ్ళని ఎన్నుకుందాం.

ఎన్నుకుందాం
కలిసి కట్టుగా నడుస్తూనే
కష్టపడే తత్వాన్ని ఎంచుకుందాం
ఓటుకు, నోటి మాటకు
కట్టుపడే వ్యక్తిత్వాన్ని ఎన్నుకుందాం.
– నరెద్దుల రాజారెడ్డి,
సెల్‌ : 9666016636

➡️