అక్కడ కొన్ని శవాలు
గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి
బహుశా రాబందుల రక్తదాహానికి
బలైన పావురాల పీనుగులై
ఉంటాయి …
ఎందుకో తెలియదు గానీ,
వాటి మనసు ఇంకా
మరణించలేదు
వాటి హృదయంలోనుంచి ఇంకా
ఏవో శబ్దాలు ఫిరంగుల్లా పేలుతూ
వినిపిస్తున్నాయి… నిశ్శబ్దంగానే…
బహుశా శాంతి సందేశమేమో !
విష సర్పాలని, విద్వేసాలని పెంచి
తెల్లపూల వాన కలగంటే ఎలా ?
శాంతి చిహ్నం రక్తసిక్త మయ్యే వేళ
కరుణామయుడు పుట్టిల్లుకమురుకంపు కొడుతుంది !
అల్లా హృదయం బద్దలైందిజోర్డాన్ నది రక్త కన్నీరై
పొంగుతుంది
మౌనం ఎప్పుడూ
మారణహౌమమే!
వేనవేల శవాల గుట్టల మధ్య
ఎగిసిపడుతున్న నిప్పురవ్వలు
ద్వేషాన్ని వెదజల్లుతూనే ఉన్నాయి
యుద్ధంలో గెలుపూ ఓటమి
ఉండవు
ఇటూ అటూ విధ్వంసం తప్ప !
అమ్మపాలు తాగి రొమ్ము గుద్దడమే
యుద్ధతంత్రమైనపుడు
నేలంతా శ్మశాన స్థలే అవుతుంది
శాంతి కాముకుల మౌనం
మౌనంగానే మరో యుద్ధానికి
ఊపిరి పోస్తుంది
అవసరమే ఆయుధం అయితే
మానవత్వం మృగ్యపోతున్నది
అప్పుడు… అవును అప్పుడే
మౌనం విస్ఫోటనమై
అగ్నిశిఖలా ఎగసి పడుతుంటే
కారుతున్న ప్రతి రక్తపు చుక్కా
ఓ రక్తసిక్త కపోతమై రివ్వున
ఎగరాలి…
పాలస్తీనా నేలపై శాంతిపూలు
పూయాలి ! – రెడ్డి శంకరరావు94943 33511