పారిశ్రామిక రంగంపై ప్రత్యేక దృష్టి-పరిశ్రమలకు శంకుస్థాపనలో సిఎం

Nov 29,2023 21:45 #cm jagan, #inauguration

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగంపై ప్రత్యేక దృష్టి సారించిందని, దీనిలో భాగంగానే గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్లో చేసుకున్న ఒప్పందాల కార్యరూపం దిశగా అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సులో చేసుకున్న ఒప్పందాల మేరకు ఏర్పాటు చేయనున్న తొమ్మిది ప్రాజెక్టులకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. రూ.1,100 కోట్ల పెట్టుబడితో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుల్లో 21,744 మందికి ఉపాధి లభించనుంది. అలాగే రూ.422 కోట్లతో చేపట్టిన ఐదు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను సిఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారిశ్రామిక రంగంలో ముఖ్యంగా ఎంఎస్‌ఎంఇ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సెక్టార్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. జిల్లాల్లో కలెక్టర్లు కూడా పారిశ్రామికవేత్తలకు సహకరించాలని కోరారు. గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్లో 386 ఒప్పందాలు చేసుకున్నామని, దీనివల్ల రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేలా ప్రణాళికలు వేసుకున్నామని తెలిపారు. ఆరు లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నారు. ఒప్పందాల్లో భాగంగా ఇప్పటికే 33 యూనిట్లలో ఉత్పత్తులు ప్రారంభమయ్యాయని, 94 ప్రాజెక్టుల పనులు వేగంగా ఉన్నాయని తెలిపారు. వీటిలో మరింత పురోగతి తీసుకొచ్చేందుకు సిఎస్‌ ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలకు చేయూతనిచ్చామని వివరించారు. నాలుగున్నర సంవత్సరాల్లో 130 భారీ, అతిభారీ ప్రాజెక్టులు ఏర్పాటు చేశామని, రూ.69 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. 1.88 లక్షల ఎంఎస్‌ఎంఇలు కొత్తగా వచ్చాయని వివరించారు. పారిశ్రామికవేత్తలకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా చూడటం ద్వారా మరిన్ని పరిశ్రమలు పెట్టేందుకు ప్రోత్సహించినవారిమవుతామని, ఆ దిశగా అధికారులూ చర్యలు తీసుకోవాలని సూచించారు. పత్తికొండలో అతితక్కువ కాలంలో టమోటా ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు సిద్ధమవడం అభినందనీయమని అన్నారు. ఎంఎస్‌ఎంఇ రంగంలో ఫిబ్రవరికి ప్రభుత్వం నుండి ఇన్సెంటివ్‌లు అందిస్తామని సిఎం తెలిపారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం దొరువులపాలెంలో రూ.250 కోట్లతో ఎడిబుల్‌ ఆయిల్‌ ప్లాంటు, ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం కొమ్మూరు వద్ద రూ.144 కోట్లతో శ్రీవెంకటేశ్వర బయోటెక్‌ ప్రైవేటు లిమిటెడ్‌, విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కోనాడ వద్ద రూ.13 కోట్లతో బ్లూఫిన్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ పనులకు సిఎం శంకుస్థాపన చేశారు. అలాగే కర్నూలు జిల్లా పత్తికొండ వద్ద రూ.12 కోట్లతో టమోటా ప్రాసెసింగ్‌ యూనిట్‌, విజయనగరం జిల్లా రేగ పంచాయతీలో సెనమీ ప్రాసెసింగ్‌ యూనిట్‌కు శంకుస్థాపన చేశారు. వీటితోపాటు కర్నూలు జిల్లా ఓర్వకల్లులో సిగాచి ఇంస్ట్రీస్‌, న్యూట్రాస్యూటికల్‌ ప్లాంటు, కాకినాడలో ఎస్టేట్‌ ప్రింటింగ్‌ క్లస్టర్‌లో కామన్‌ ఫెసిలిటీ సెంటర్లనూ, అలాగే 18 జిల్లాల్లో 21 చోట్ల ఏర్పాటు చేయనున్న వేర్వేరు ప్రాజెక్టులకూ సిఎం శంకుస్థాపన చేశారు.

➡️