ప్రజాశక్తిాఅమరావతి బ్యూరో/న్యూఢిల్లీ బ్యూరో :స్కిల్ డెవలప్‌మెంటు కేసులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు హైకోర్టు ఇచ్చిన రెగ్యులర్ బెయిల్ తీర్పుపై సుప్రీంకోర్టును రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించింది. ఈ మేరకు చంద్రబాబు బెయిల్‌ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. రెగ్యులర్ బెయిల్ ఇచ్చే సందర్భంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలు సరికావని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. బెయిల్ విషయంలో సుప్రీంకోర్టు నిర్దేశించిన కొలమానాలకు విరుద్ధంగా హైకోర్టు వ్యవహరించిందని, పరిధి దాటినట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించింది. చంద్రబాబు లేవనెత్తని పలు అంశాల జోలికి హైకోర్టు వెళ్లిందని, వాటిని హైకోర్టు పరిగణనలోకి తీసుకోవడం సరైందికాదని పేర్కొంది. హైకోర్టు ఇచ్చిన బెయిల్ తీర్పు లోపభూయిష్టంగా వుందని, ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని కోరింది. కేసు దర్యాప్తు కొనసాగుతుండగా దర్యాప్తులో లోపాలను ప్రస్తావించడం సరైందికాదని పేర్కొంది. సిఐడి కోరిన వివరాలను చంద్రబాబు ఇవ్వలేదని తెలిపింది. బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరిగే సమయంలో చంద్రబాబు తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించలేదని పేర్కొంది. కేసు దర్యాప్తుపై కింది కోర్టు చేయాల్సిన పూర్తిస్థాయి ట్రయల్‌ను హైకోర్టు నిర్వహించినట్లయిందని సుప్రీం దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్లింది.