రేపు తెలంగాణలో పోలింగ్‌

Nov 29,2023 21:55 #Assembly Elections, #Telangana

-రాష్ట్ర వ్యాప్తంగా 35,655 కేంద్రాల ఏర్పాటు

ప్రజాశక్తి-హైదరాబాద్‌ బ్యూరో, గుంటూరు జిల్లా ప్రతినిధితెలంగాణలో గురువారం జరిగే శాసనసభ ఎన్నికలకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 35,655 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌కు ఇసి చర్యలు తీసుకుంది. బుధవారం సాయంత్రానికే ఎన్నికల సామగ్రితో సిబ్బంది పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. గురువారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. తీవ్రవాద ప్రభావమున్న 13 నియోజకవర్గాల్లో ఉదయం ఆరు గంటలకు పోలింగ్‌ ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటలకు ముగియనుంది. పోలింగ్‌ ప్రక్రియ పరిశీలనకు 22 వేల మంది అబ్జర్వర్లను, స్క్వాడ్లను నియమించారు. పోలింగ్‌ ప్రక్రియలో 1.85 లక్షల మంది సిబ్బంది పాల్గంటున్నారు. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల 3,26,02,799 మంది. వీరిలో పురుషులు 1,62,98,418 మంది, మహిళలు 1,63,01,705 మంది, ట్రాన్స్‌జెండర్లు 2,676 మంది ఉన్నారు. సర్వీసు ఓట్లు 15,406, ప్రవాస భారతీయుల ఓట్లు 2,944 ఉన్నాయి. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాల్లో 2,290 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వారిలో మహిళలు 221 మంది, పురుషులు 2,068 మంది, ట్రాన్స్‌జెండర్‌ ఒకరు ఉన్నారు. 80 ఏళ్లు పైబడిన వారికి ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల బందోబస్తు నిమ్తితం కేంద్ర ఎన్నికల సంఘం 375 కంపెనీల సాయుధ కేంద్ర బలగాలను, రాష్ట్ర ప్రభుత్వం 50 వేల మంది పోలీసులను కేటాయించాయి. డిసెంబరు మూడున ఓట్ల లెక్కింపు జరగనుంది. సిద్ధంగా ఎపి పోలీసులుగుంటూరు జిల్లా మంగళగిరిలోని పోలీసు హెడ్‌ క్వార్టర్స్‌్‌ నుంచి గుంటూరుకు 500 మంది, పల్నాడుకు 400 పోలీసులు బుధవారం చేరుకున్నారు. తెలంగాణ ఎన్నికల దృష్ట్యా ఎప్పుడు అవసరం అయితే అప్పుడు అక్కడికి పంపేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులను సిద్ధంగా ఉంచామని గుంటూరు ఎఎస్‌పి సుప్రజ తెలిపారు.

➡️