సెంటు భూమి కూడా లేని పేదలు సైతం పశు పోషణకు ప్రాణం పెట్టారు. గిట్టుబాటు కాకపోయినా పాడి ఆహార భద్రత ఇచ్చేది. అందుకు పల్లెలు పడరాని పాట్లు పడేవి. పొద్దు పొడవక ముందే పచ్చి గడ్డి (మేత) మూటలు ఇంటికి చేరేవి. పశువుల డొక్కలు నింపాలంటే ఎండలో, వానలో, బురదలో దేశం పట్టుకు ఏళ్ల తరబడి పశువుల వెంట తిరగడం ఎలా సాధ్యమో ఈ ప్రభుత్వం ఏనాడైనా ఆలోచిం చిందా? రాష్ట్ర రహదారుల వెంబడి, డొంకలు, చెరువు కట్టలు, కాల్వ గట్టుల మీద గడ్డి విత్తనాలు చల్లి పచ్చి మేత పెంచాలని ప్రభుత్వం తలంచినా అమలు జరిగింది లేదు. ఉన్న ఈ కొద్దిపాటి పాడిని, పశు పోషకులను కాపాడు కోవాలని ఏమాత్రం ఆలోచన ఉన్నా ప్రధానంగా ఎస్సీల నివాస ప్రాంతాలకు సమీపంలో పశువుల బీడు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది. కనీసం 15-20 ఎకరాలు పశువుల బీడు కోసం సేకరించాలి. గ్రామీణ పేదలు పాడి వైపు ఆసక్తి కనబరుస్తున్నప్పటికీ అందుకు తగిన అవకాశాలు లేక మిన్నకుండి పోతున్నారు. పేదల ఈ నిస్సహాయ స్థితిని ఏ విధంగా సామాజిక సాధికారత అంటారో వైసిపి ప్రభుత్వం సావధానంగా ఆలోచించాలి. వైసిపి ప్రభుత్వం సైతం ఈ రోజు పాల వెల్లువ పేరుతో ప్రచారం చేసుకోవడం తప్ప పచ్చి మేత కొరతను అధిగమించడానికి చేసిందేమీ లేదు. పశువుల ప్రాణాలకు విలువ ఇస్తున్నట్లు కనిపిస్తున్నా పశు పోషకులను అన్ని ప్రభుత్వాల మాదిరి పాలు పితికే యంత్రాలుగానే భావిస్తోంది.- ఎన్.కె. రావు,బాపట్ల జిల్లా, ఆంధ్ర ప్రదేశ్.