‘ఈ రోజుల్లో ఫేక్ వీడియోలు క్రియేట్ చేయడం సర్వసాధారణమైపోయింది. టెక్నాలజీ పెరగడం వరమో, శాపమో అర్థం కాకుండా ఉంది. అలాంటి వీడియోలు బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో నాకు మొదట అమితాబ్ బచ్చన్ మద్దతుగా నిలిచారు. ఆ తర్వాత ఇండిస్టీకి చెందిన చాలామంది మద్దతు పలికారు. ఆ వీడియో చూసినప్పుడు చాలా బాధ కలిగింది. చాలామంది సెలబ్రిటీలకు ఇలానే జరుగుతోంది. ఇవన్నీ చూస్తుంటే మనం ఏం చేయగలం అనిపించింది. అయితే దీన్ని సాధారణంగా తీసుకోకూడదనుకున్నా. అందుకే స్పందించాను. ఈ సందర్భంగా నేను అమ్మాయిలందరికీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. ఏదైనా సంఘటన మిమ్మల్ని ప్రభావితం చేసి బాధిస్తే ఎవరూ కూడా నాకెందుకులే అని నిశ్శబ్దంగా ఉండొద్దు. సమస్య ఎవరిదైనా ముందుకొచ్చి స్పందించండి. అప్పుడు సమాజంలో ప్రజల మద్దతు దొరుకుతుంది.’ అని హీరోయిన్ రష్మిక వ్యాఖ్యానించారు. డిసెంబర్ 1న విడుదల కానున్న యానిమల్ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మీడియాతో మాట్లాడారు. డీప్ ఫేక్ వీడియో, ట్రోల్స్ గురించి వివరించారు. అలాంటి వాటిని పట్టించుకోకూడదని సూచించారు.