ఉమ్మడి ఉంధ్రప్రదేశ్‌ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విభజించటానికి ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం (విభజన చట్టం) రూపొందించారు. ఈ బిల్లు ఉభయసభ ఆమోదం పొంది 2014 మార్చి 31న చట్టమై, 2014 జూన్ 2 నుండి అమలులోకి వచ్చినది. ఈ చట్టంలో ఆంధ్రప్రదేశ్‌కు అనేక హామీలు ఇచ్చారు. గత తొమ్మిదేళ్లుగా దేశాన్ని ఏలుతున్న నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం ఆ హామీలు వేటీనీ అమలు చేయలేదు. ప్రత్యేక హోదా కల్పించలేదు. దీంతో వ్యవసాయక రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా పురోగమించలేదు. ఉపాధి అవకాశాలు పెరగటం లేదు. ఈ నేపథ్యంలో 2024 సాధారణ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని, బిజెపితో జత కట్టే పార్టీలను నిలదీయాలి. విభజన చట్టంలో పేర్కొన్న కడప ఉక్కు కర్మాగార నిర్మాణం, దుగ్గరాజప్నటం వద్ద దశలవారీగా భారీ నౌకాశ్రయ ఏర్పాటు, రాష్ట్ర విభజన జరిగిన 6 నెలల లోపు కొత్త రైల్వే జోన్ ఏర్పాటు, గ్రీన్‌ఫీల్డ్ ముడి చమురు శుద్ధి కర్మాగారం, పెట్రో రసాయన సముదాయ ఏర్పాటు, ఢిల్లీ-ముంబై పారిశ్రామిక కారిడార్ తరహాలో వైజాగ్ చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు, విశాఖపట్నం మరియు విజయవాడ-తెనాలి-గుంటూరులలో మెట్రో రైలు సౌకర్యం ఏర్పాటుకు చర్యలు…వంటివి చేపట్టాలి. ఇవేమీ అమలు జరగలేదు. వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ఖండ్ తరహాలోను, కోరాపుట్-బోలంగీర్-కలహండి (ఒరిస్సా) తరహా లోను ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ప్రకటించారు. దీని ప్రకారం ఈ జిల్లాలకు సహాయం అందాలి. అయితే ఇప్పటికి కేంద్రం 7 జిల్లాలకు 1051 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నది.
రాజధాని నిర్మాణానికి ఆర్థిక సహాయం
విభజన చట్టంలో 94(3) సెక్షన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజభవన్, హైకోర్టు, సచివాలయం, శాసనసభ, శాసనమండలి తదితర మౌలిక వసతులతో కొత్త రాజధాని నిర్మాణం కోసం కావలసిన సౌకర్యాలు సృష్టించడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మద్దతు ఇవ్వాలి. దీనికి నాటి రాష్ట్ర ప్రభుత్వం రూ. 42,935 కోట్లు అంచనా వేసింది. కేంద్రం కేవలం రూ.1500 కోట్లు ఇచ్చింది. 2015 అక్టోబరు 22న రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రానికి చెంబుడు నీళ్లు, మట్టి మాత్రమే అందించాడు. గత రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాల భూసమీకరణ చేసి తాత్కాలిక రాజధాని భవనాలు మాత్రమే నిర్మించింది. సింగపూర్ మద్దతుతో స్విస్ చాలెంజ్ పద్ధతిలో రాజధాని నిర్మాణం చేస్తామని ఆశల పల్లకిలో ఊరేగించారు. 2019 మే లో వై.యస్.జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల అంశంతో వివాదం చేయడంతో రాజధాని అంశం న్యాయస్థానాల పరిధిలోకి వెళ్లింది. పాలనా రాజధాని తప్పనిసరిగా అమరావతిలో కొనసాగాలి. భూసమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరగాలి. కేంద్ర ప్రభుత్వం రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన నిర్దేశాలు ఇవ్వకుండా నాటకాలు కొనసాగిస్తున్నది. అమరావతిలో రాజధాని నిర్మాణం జరిగి, దానికి కేంద్ర ఆర్థిక సహాయం అందించాలి.
ఉమ్మడి ఆస్తుల విభజన
రాష్ట్ర విభజన నాటికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జనాభా నిష్పత్తి 58.32:41.68గా ఉన్నది. ఆస్తులను అదే నిష్పత్తిలో పంచుకోవాలి. షెడ్యూళ్లు 9, 10లలో ఉమ్మడి ఆస్తుల సంస్థలను గుర్తించారు. షెడ్యూల్ 9లో 90 సంస్థలను, షెడ్యూల్ 10లో 107 సంస్థలను ఉమ్మడి ఆస్తులుగా గుర్తించారు. వీటి విభజన కోసం విశ్రాంత ఐ.ఏ.యస్ అధికారి శ్రీమతి షీలా భిడోను నియమించారు. ఆమె నాయకత్వంలో ఆస్తుల పంపిణీపై కొన్ని మార్గదర్శక సూత్రాలు రూపొందించి, ప్రతిపాదనలు చేశారు. అవి ఇంతవరకు అమలు జరగలేదు. ఉమ్మడి ఆస్తులలో ఆంధ్రప్రదేశ్‌కు సుమారు రూ.60 వేల కోట్లు రావాలి. ఇంతవరకు రూపాయి కూడా రాలేదు. కేంద్రం ఏ మాత్రం జోక్యం చేసుకోలేదు. ఆస్తుల పంపిణీలో కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు పూర్తిగా అన్యాయం చేసింది.
జాతీయ విద్యాసంస్థలు
2014లో విభజన నాటికి ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ విద్యాసంస్థలు లేవు. విభజన చట్టంలో 13వ షెడ్యూల్‌లో 11 జాతీయ విద్యాసంస్థలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఐ.ఐ.టి తిరుపతిలో, ఐ.ఐ.ఎం విశాఖపట్నంలో, సెంట్రల్ యూనివర్శిటీ అనంతపురంలో, గిరిజన యూనివర్శిటి విజయనగరంలో, ఎన్.ఐ.టి తాడేపల్లిగూడెంలో, ఎయిమ్స్ మంగళగిరిలో, వ్యవసాయ విశ్వవిద్యాలయం గుంటూరులో, పెట్రోలియం యూనివర్శిటి విశాఖపట్నంలో ప్రతిపాదించారు. వీటిలో కొన్నింటిని ప్రారంభించారు. ఈ 11 జాతీయ విద్యాసంస్థలకు ఇప్పటికి రూ.12 వేల కోట్లు ఖర్చు చేయాలి. కానీ, కేవలం రూ.2,500 కోట్లు ఖర్చు చేశారు. దీంతో ఈ సంస్థలు వివిధ ప్రాంతాలలో అద్దె భవనాలలో నడుస్తున్నాయి. భవనాలు నిర్మించాలన్నా, నిర్మాణానికి స్థల సేకరణ జరగాలన్నా నిధులు అవసరం. నిధులు లేక ఈ విద్యాసంస్థలలో మౌలిక వసతులు లోపించి విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే నిధులు విడుదల చేసి మౌలిక వసతులు, భవనాల నిర్మాణం చేపట్టాలి.
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం
విభజన చట్టంలో సెక్షన్ 90 ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించారు. ప్రజా ప్రయోజనాల కోసం ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని కేంద్రం స్వీకరిస్తుంది. పర్యావరణ, అటవీ, పునరావాస, పునర్నిర్మాణ అనుమతులకు కేంద్రానిదే బాధ్యత అని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా 7.2 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగు నీరు, గోదావరి డెల్టాలో 10.13 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, 80 టి.యం.సిల నీరు కృష్ణా నదికి మళ్లించటం, విశాఖ నగరానికి తాగు నీరు, పారిశ్రామిక అవసరాలకు 23 టి.యం.సిల నీరు, 611 గ్రామాలకు తాగు నీరు సరఫరా, 960 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి మొదలగు ఉపయోగాలు జరుగుతాయని నిపుణులు పేర్కొన్నారు.2017-18 సవరించిన అంచనా మొత్తం రూ.55,656 కోట్లుగా అంచనా వేశారు. దీనిలో భూసేకరణకు, పునరావాసానికి రూ.33 వేల కోట్లు ప్రతిపాదించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో నిర్వాసితులకు పునరావాసం కల్పించటం అతి పెద్ద అంశం. 373 గ్రామాలలో 1,05,000 కుటుంబాలు నిర్వాసితులుగా మారతారు. ఇప్పటికి కేవలం 7 వేల కుటుంబాలకు మాత్రమే పునరావాసం జరిగి, కేవలం 7 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. పునరావాసం జరగకుండా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాదు. గత ప్రభుత్వం, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పునరావాసాన్ని నిర్లక్ష్యం చేశాయి. కేంద్ర ప్రభుత్వం పునరావాసానికి బాధ్యత వహించాలని విభజన చట్టం తెలపగా కేంద్ర ప్రభుత్వం పునరావాస నిధులతో మాకు సంబంధం లేదని అంటున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన విధానాలు అనుసరించి, ప్రాజెక్ట్ నిర్మాణంతో పాటు పునరావాసానికి కేంద్రం నిధులిస్తేనే పోలవరం నిర్మాణం జరుగుతుంది.
ప్రత్యేక హోదా-మోడీ మోసం
ఆంధ్రప్రదేశ్ విభజన చట్ట ఆమోద సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రకటించారు. ఐదేళ్లు కాదు, పదేళ్లు ఇవ్వాలని నాటి రాజ్యసభలో బిజెపి నాయకుడు ఎం.వెంకయ్య నాయుడు ప్రకటించారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తరువాత ప్రత్యేక హోదా హామీని నిలబెట్టుకోకుండా ఆంధ్రులకు అన్యాయం చేశారు. 2014కు ముందు ప్రణాళికా సంఘం సిఫార్సులతో 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారు. ప్రత్యేక హోదా వల్ల ఒక రాష్ట్రంలో పారిశ్రామిక రాయితీలు, పన్నుల రాయితీలు లభించి పారిశ్రామికాభివృద్ధి జరుగుతుంది. 2016లో కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకుండా, ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. నాటి ముఖ్యమంత్రి ప్రత్యేక ప్యాకేజీ ద్వారా రాష్ట్రానికి 70 వేల కోట్లు లబ్ధి జరుగుతుందని ప్రకటించారు. ప్రత్యేక ప్యాకేజీ యొక్క దగా రెండేళ్ల తరువాత నాటి ముఖ్యమంత్రికి అర్ధమైనది. ప్రస్తుత ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్‌రెడ్డి తనకు 25 మంది లోక్‌సభ సభ్యులను ప్రజలు ఇస్తే ప్రత్యేక హోదా సాధిస్తానని ప్రకటించారు. 22 మంది వై.సి.పి లోక్‌సభ సభ్యులుగా గెలుపొందారు. ప్రత్యేక హోదా సాధన తమ వల్లకాదని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తివేసింది.
నరేంద్ర మోడీ మోసం – 3 ప్రాంతీయ పార్టీల వైఖరి
2014 మే లో వచ్చిన కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం 5 కోట్ల ఆంధ్రులకు అన్యాయం చేయటమే కాక, మోసం చేసింది. విభజన చట్టంలో హామీలను అమలు చేయక పోవటమేకాక, ప్రత్యేక హోదా ఇవ్వలేదు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి లేకపోవటంతో, ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి. నరేంద్ర మోడీ, అమిత్ షా ద్వయం తమ పార్టీకి ప్రయోజనమున్న రాష్ట్రాలకే లబ్ధి కలిగే విధంగా నిర్ణయాలు తీసుకోవటం సమాఖ్య విధానంలో దారుణమైన విషయం.
విభజన హామీలు అమలు జరపని, ప్రత్యేక హోదా ఇవ్వని నరేంద్ర మోడీ ప్రభుత్వం పట్ల రాష్ట్రంలో మూడు ప్రాంతీయ పార్టీలు అనుసరిస్తున్న వైఖరి పూర్తి ప్రజావ్యతిరేకంగా ఉన్నది. అధికారంలో ఉన్న వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీగానీ, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీగానీ, మరో ప్రాంతీయ పార్టీ జనసేనగానీ రాష్ట్రం పట్ల కేంద్రం అనుసరిస్తున్న వివక్షా పూరితమైన వైఖరిని ప్రశ్నించకపోవటం దారుణమైన విషయం. కనీసం విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశంలో కూడా మూడు పార్టీల నాయకత్వాలు గొంతెత్తి ప్రశ్నించలేకపోయాయి. తమిళనాడులో స్టాలిన్ నాయకత్వంలో డి.ఎమ్.కె ప్రభుత్వం, కేరళలో పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్.డి.ఎఫ్ ప్రభుత్వం అనేక సందర్భాలలో కేంద్రం చేస్తున్న అన్యాయాలకు వ్యతిరేకంగా గళమెత్తాయి. ఈ మూడు ప్రాంతీయ పార్టీల నాయకులు ఇప్పటికైనా తమ వైఖరి మార్చుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయమే అన్నిటికంటే శక్తివంతమైనది. ప్రజలు, ప్రజాసంఘాలు, వామపక్ష సంఘాలు, దళిత, బహుజన సంఘాలు, అభ్యుదయ వాదులు, మేధావులు అందరూ కలిసి విభజన హామీలు అమలు జరగటానికి…ప్రత్యేక హోదా కోసం…కేంద్రంపై, రాష్ట్ర ప్రభుత్వంపై, మూడు ప్రాంతీయ పార్టీల నాయకత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలి.
వ్యాసకర్త : కె.ఎస్. లక్ష్మణరావు, శాసనమండలి సభ్యులు, సెల్ : 8309965083