హిందూ మతం ఏకశిల వంటిదని నమ్మించడానికి బిజెపి ప్రయత్నిస్తున్నది. హిందువుల్లోని అంతరాలను మరుగుపర్చాలని చూస్తున్నది. కులగణన జరిగితే అంతరాలు ఏ స్థాయిలో ఉన్నాయో బయట పడతాయి. తన మనుస్మృతిని పొగిడేవారు, చాతుర్వర్ణ వ్యవస్థను ఎలా వద్దంటారు? అంటరానితనంపై, కుల అసమానతలపై ఎందుకు పోరాడుతారు? కర్మ సిద్ధాంతాన్ని ప్రభోదించేవారు నిచ్చెనమెట్ల కులవ్యవస్థను ఎందుకు నాశనం చేయాలనుకొంటారు? కనుక పైకి ఏం చెప్పినా సిద్ధాంత పరంగానే బిజెపి …బీసీల, ప్రత్యేకించి బాగా వెనుకబడిన బీసీల ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీల అభ్యున్నతికి వ్యతిరేకం.
నూరు ఎలుకలు తిన్న పిల్లి హజ్‌కు వెళ్లిందని సామెత. బిజెపి బిసి ఆత్మగౌరవ సభ కూడా అలాంటిదే. దేశ ప్రధాని నరేంద్ర మోడీయే స్వయంగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరుగనున్న సందర్భంలో ఎన్నికల ప్రచార సభగా కాకుండా బిసి ల ఆత్మగౌరవం పేర జరిపిన సభ ఒక అపదమొక్కు మాత్రమే.
బిజెపి కి బడుగులకు రిజర్వేషన్లు అంటే వంటికి కారం పూసుకొన్నట్లు ఉంటుంది. కనుక కేంద్ర సర్వీసుల్లో బిసి రిజర్వేషన్లు ప్రతిపాదించిన మండల్ సిఫారసులను వెనక్కి నెట్టడానికి అద్వానీ ఆధ్వర్యంలో అయోధ్య రథయాత్ర జరిపింది. రథయాత్రలో అద్వానీ వెనకే ఉంటూ సమన్వయం చేసిన సిపాసాలార్ (సేనాని) ఈ మోడీయే. ఆనాడు కూడా పెద్దపత్రికలు మండల్ సిఫారసులను వ్యతిరేకించినా, ప్రతిభ అన్న అమాంబాపతు వాదనను ముందుకు తెచ్చినా ఆ యుద్ధానికి అవి మండల్-కమండల్, మండల్-మందిర్ వంటి పదబంధాలు సృష్టించాయి.
ఆ యుద్ధానికి ఒకవైపు అప్పటి ప్రధాని విశ్వనాధ ప్రతాప్ సింగ్ సారథ్యం వహిస్తే మరోవైపు అద్వానీ సారథ్యం, ఆయన వెనుక సెకెండ్ ఇన్ కమాండ్‌గా మోడీ. విశ్వనాధ ప్రతాప్ సింగ్‌ను ప్రధాని పదవి నుండి లాగేసే దాకా బిజెపి నిద్రపోలేదు. రామమందిర నిర్మాణం కోసం రథయాత్ర అని బిజెపి చెప్పుకొన్నా దాని అసలు ఉద్దేశాల్లో బిసి రిజర్వేషన్లకు మోకాలడ్డటం ఒకటి. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దేశమంతా ఆనాడు జరిపిన ఆందోళనలో కూడా బిజెపి ప్రచ్ఛన్న హస్తానిది ప్రధాని పాత్రే. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్‌టి రామారావు బిసి ల రిజర్వేషన్ కోటాను పెంచగా ఇక్కడ కూడా బాపతే అడ్డుపడింది. బిసి కోటా పెంపును వ్యతిరేకిస్తూ ఎన్‌ఎస్‌ఎస్ అనే ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ఆర్‌ఎస్‌ఎస్ చక్రం తిప్పింది. ఎన్టీఆర్‌కు ఊపిరాడని స్థితిని తెచ్చిపెట్టింది. ఆత్మగౌరవ సభలో వేదిక మీదున్న జనసేన అధ్యక్షుడికి ఆ విషయం తెలుసో లేదో గానీ, ఈటెల రాజేందర్‌కు బాగానే తెలిసుండాలి. తెలంగాణ ఎన్నికల ఎత్తుగడల్లో భాగంగా బిజెపి ఏకాఎకిన బండి సంజరుని రాష్ట్ర అధ్యక్షపదవి నుండి తప్పించి కిషన్‌రెడ్డిని కూర్చోబెట్టింది. ఎన్నికల సందర్భంగా అత్యంత ఆంతరంగిక వలయాల్లో వేయాల్సిన ఎత్తులకు జిత్తులకు బండి సంజరు పనికి రాకుండా పోయారు.
నేను కూడా బీసీనే అని మోడీ చేసే తర్కం కూడా చెల్లుబాటు కాదు. ఎందుకంటే ‘తెలి’ వైశ్య కులాల్లో ఒకటి. వృత్తి రీత్యా ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనే శూద్రకులమే అయినా ఆ కులంలో ఆస్తిపాస్తులు గలవారు, చదువుకొన్నవారు గణనీయ సంఖ్యలో ఉన్నారు. కనుకనే ‘తెలి’ కులాన్ని వెనకబడిన కులంగా పరిగణించలేదు. గుజరాత్‌లో 1979-80లో మాత్రమే ‘తెలి’ కులాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం, 1999లో కేంద్ర ప్రభుత్వం బిసి కులాల జాబితాలో చేర్చాయి. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ ఆ రాష్ట్ర స్థానిక సంస్థల్లో బీసీలకు 10 శాతం మాత్రమే రిజర్వేషన్లు అమలు చేశారు. ఈ ఏడాది ఆగస్టు 27 నుండి మాత్రమే ఆ కోటాను 22 శాతానికి పెంచారు. ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధంగా బిసి కోటాను మరింత పెంచే అవకాశం ఉందన్న ప్రతిపక్ష కాంగ్రెస్ సభలో చేసిన వాదనను బిజెపి ప్రభుత్వం ఒప్పుకోలేదు. కాగా తెలంగాణలో 2018 నవంబర్ నుండి స్థానిక సంస్థల్లో బిసి కోటా 34 శాతం అమలవుతోంది. రెండు రోజుల క్రితం బీహార్ ప్రభుత్వం విద్యా ఉద్యోగాల్లో ఎస్‌సి, ఎస్‌టి, బిసి రిజర్వేషన్లు 65 శాతానికి పెంచింది.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ కులగణన ఫలితాలను వెల్లడి చేయగానే కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఒకరి వెంట ఒకరుగా తమ రాష్ట్రాల్లోనూ కులగణన నిర్వహిస్తామని ప్రకటించారు. దేశం మొత్తం మీద బిసి కులాల ఓట్లు కాంగ్రెస్‌కు నానాటికీ తగ్గిపోయాయి. బిజెపి కి పెరిగాయి. గనుక కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వెంటనే కులగణన రాగం అందుకొన్నారు. సుదీర్ఘకాలం అధికారంలో ఉన్నా ఎన్నడూ కాంగ్రెస్ ఆ పని చేయలేదు. జనాభా లెక్కల సేకరణకు వెళ్లే ముందు ప్రతిసారి కులగణన కూడా జరిపాలన్న డిమాండ్ ముందుకొచ్చింది. కులగణన వల్ల జనాభా సంఖ్యలతో పాటు ఏ కులం విద్యా, ఉద్యోగాల్లో, ఆర్థికంగా ఏ స్థాయిలో ఉందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి ఎవరికి ఎలాంటి ప్రత్యేక సహాయం అవసరమన్నది నిర్ణయించుకోవచ్చు. బిసి రిజర్వేషన్లలో అంతర్గత కోటాలపై పున:పరిశీలన చేయవచ్చు. కాంగ్రెస్ ఆ పని చేయలేదు. కానీ ఇప్పుడు కులగణన కోసం డిమాండ్ చేస్తోంది. ఇప్పటికైనా ఆ పని చేస్తున్నందుకు సంతోషం.
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి మొదట కులగణనకు ససేమిరా అన్నా ఇప్పుడు శషబిషలు పడుతోంది. హోంమంత్రి అమిత్ షా కొన్నిరోజుల క్రితం తన పార్టీ రాష్ట్ర అధ్యక్షులతో సుదీర్ఘ సమావేశం జరిపారు. రాహుల్ గాంధీ కులగణన కోసం డిమాండ్ చేస్తున్నందున ఎన్నికలో దాని ప్రభావం ఎలా ఉంటుందని అడిగారు. వాళ్లనడిగితే ఏం తెలుస్తుంది? కనుక ‘ఏడుగురు అంధులు-ఒక ఏనుగు’ అన్న కథలాగే ఉంటుంది. చివరకు కులగణనకు మేము వ్యతిరేకమని ఎప్పుడూ చెప్పలేదు. పోతే ఇప్పటిదాకా ఒక నిర్ణయం చేయలేదంతే అని బిజెపి గోడమీది పిల్లి లాంటి వైఖరి చూపెట్టింది.
బిజెపి కి ప్రధానంగా బ్రాహ్మణ, వైశ్య కులాలతో పాటు ఇతర ఆధిపత్య కులాల పార్టీ. అడుగడుగునా అది కన్పిస్తుంది. దాన్ని పోగొట్టడానికి సీట్ల కేటాయింపుల్లో బీసీల సంఖ్యను కాస్త పెంచినా ఆధిపత్య కులాల పెత్తనమే బిజెపి ని నడిపిస్తోంది. దాని మార్గదర్శి ఆర్‌ఎస్‌ఎస్ గురించి చెప్పనే అక్కర్లేదు. దాని ఎగశ్వాస దిగశ్వాస రెండూ అధిపత్యకులమే. యూపీలో చూశాం కదా. అక్కడ గతంలో ఎన్నికల ముందు బిజెపి సోషల్ ఇంజనీరింగ్ చేసి ముఖ్యమంత్రిగా ఒక బిసి నేతను ఎంపిక చేయవచ్చు అన్న భ్రమను సృష్టించింది. చివరకు అధికారాన్ని రాజ్‌పుత్ అయిన యోగి ఆధిత్యనాథ్ చేతుల్లో పెట్టింది. యూపీలో చేయలేని పనిని తెలంగాణలో మోడీ చేస్తారట. ‘గాలికి పోయే పేలంపిండి కృష్ణార్పణం’ అంటే ఇదే. యుపి లో ఎస్‌పి, బిఎస్‌పి లు తమ అవకాశవాదం వల్ల ఆ ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1983 శాసనసభ ఎన్నికల్లోనూ, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ ఎన్టీఆర్ నాయకత్వంలోని తెలుగు దేశానికి బిసి కార్డు బాగా ఉపయోగపడింది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే విధానాన్ని ఆయన అనుసరించారు. శాశ్వతమనుకొన్న కాంగ్రెస్ కోటలను కూలగొట్టారు. బీసీని ముఖ్యమంత్రిని చేస్తానని ఎన్టీఆర్ చెప్పలేదు. కాని మంత్రివర్గ సామాజిక సమతుల్యంలో కొన్ని మార్పులు చేశారు. యుపి లో అలా జరగలేదు. మైనారిటీలు, ఎస్‌సి లు బలహీన వర్గాలపై ఆ రాష్ట్రంలో ఇదివరకెప్పుడూ లేనన్ని దౌర్జన్యాలు, అఘాయిత్యాలు. గోరక్‌పూర్ బాబా (మఠాధిపతి) బుల్డోజర్ బాబాగా పేరు గడించారు.
ఎన్నికల్లో గెలవడం కోసం 2013లో బిజెపి ముజఫర్‌నగర్‌లో మతకలహాలను సృష్టించింది. వేలాది మంది ముస్లింలకు నేటి పాలస్తీనియన్లకు పట్టిన గతిని పట్టించింది. ఊళ్లకు ఊళ్లు ఖాళీ అయ్యాయి. పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించాయి. అదంతా జాట్లను ఎన్నికలో తనవైపు తిప్పుకొనడానికి బిజెపి చేసిన దుర్మార్గం. ఇదే కుటిల విధానాన్ని మరో రూపంలో బిజెపి చేయగలదు. తన రాజకీయ అవసరాల కోసం కొన్ని ఆధిపత్య కులాలను బిసి జాబితాలో అది తప్పక చేర్చుతుంది. ఏ మాత్రం అవకాశం దొరికినా నేడు నిజమైన వెనుకబడిన కులాలపై అది శఠగోపం పెడ్తుంది.
‘ఇండియా’ వేదిక లోని అన్ని పార్టీలు నేడు కులగణన కోసం డిమాండ్ చేస్తున్నాయి. యుపిఎ ప్రభుత్వ హయాంలో, 2011 జనాభా లెక్కల సేకరణ సందర్భంగా కులగణన కూడా చేపట్టాలని భావించారు. కాని కాంగ్రెస్‌లోని కొందరు నాయకుల నుండి వచ్చిన ఒత్తిడి వల్ల ఆ ప్రయత్నం విరమించుకొన్నారు. ఇతర పార్టీల ఒత్తిడి మీద గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి శాఖల ద్వారా సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సెస్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం జరిపించింది. దాని కోసం రూ.5 వేల కోట్లు ఖర్చు చేసింది. 2014 లోక్‌సభ ఎన్నికలకు కొద్దిగా ముందు ఆ కసరత్తు ముగిసింది.
ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం… అందులో సవాలక్ష తప్పులున్నాయంటూ ఆ గణాంకాలను వెల్లడించలేదు. 1931లో బ్రిటిష్ పాలనలో కుల గణాంకాల లెక్కతీశారు. 2010 మే నెలలో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో అనంత కుమార్ (బిజెపి) కులగణన జరపాలని డిమాండ్ చేశారు. ఇతర పక్షాల సభ్యులతోపాటు బిజెపి సభ్యుడు గోపీనాథ్ ముండే కూడా కులగణన జరపాలని కోరారు. ప్రతిపక్షంలో కులగణన జరపాలని పట్టుబట్టిన బిజెపి తాను అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తలేదు.
హిందూ మతం ఏకశిల వంటిదని నమ్మించడానికి బిజెపి ప్రయత్నిస్తున్నది. హిందువుల్లోని అంతరాలను మరుగుపర్చాలని చూస్తున్నది. కులగణన జరిగితే అంతరాలు ఏ స్థాయిలో ఉన్నాయో బయట పడతాయి. తన మనుస్మృతిని పొగిడేవారు చాతుర్వర్ణ వ్యవస్థను ఎలా వద్దంటారు? అంటరానితనంపై, కుల అసమానతలపై ఎందుకు పోరాడుతారు? కర్మ సిద్ధాంతాన్ని ప్రభోదించేవారు నిచ్చెనమెట్ల కులవ్యవస్థను ఎందుకు నాశనం చేయాలనుకొంటారు? కనుక పైకి ఏమి చెప్పినా సిద్ధాంత పరంగానే బిజెపి బీసీల, ప్రత్యేకించి బాగా వెనుకబడిన బీసీల ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీల అభ్యున్నతికి వ్యతిరేకం.
బిజెపి ప్రభుత్వం జస్టిస్ రోహిణి కమిషన్ సిఫారసులను కూడా అమలు చేయడానికి సిద్ధంగా లేదు. ఆ సిఫారసులను అమలు చేస్తే బీసీల్లో అభివృద్ధి చెందిన కులాల నుండి వ్యతిరేకత వస్తుందని భయం. ఎం.ఆర్.బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూరు కేసులో 1963లో సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ రాజ్యాంగంలోని 15(4) ఆర్టికల్ బీసీల్లో వర్గీకరణ చేయాలని చెప్పడం లేదని పేర్కొంది. కాని ఇందిరా సావ్నే కేసులో (1992), బీసీల్లో వర్గీకరణ చేయరాదన్న రాజ్యాంగపరమైన, చట్టపరమైన నిషేధం ఏదీ లేదని అదే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయినప్పటికీ రోహిణీ కమిటీ సిఫారసుల మేరకు బీసీల్లో వర్గీకరణ జరిపి అత్యంత వెనుకబడిన వారికి మేలు చేసే ఉద్దేశం మోడీలో బిజెపి ఏ కోశానా ఉండే అవకాశం లేదు. కనుక బిజెపి బిసి ఆత్మగౌరవ సభను దగాకోరు సభగానే చూడాలి.
/ వ్యాసకర్త ‘ప్రజాశక్తి’ పూర్వ సంపాదకులు /
ఎస్. వినయ కుమార్