సహనం శాంతి ప్రదాయిని!

Nov 16,2023 06:30 #Intolerance, #Peace, #Special Days
international-tolerance-day-article

నేడు ‘అంతర్జాతీయ సహన దినోత్సవం’
అసహనం అనర్థదాయకం. అసహనం ప్రమాద కారణం. అసహనం నష్టదాయకం. అసహనం అపఖ్యాతి కారణం. అసహనం ఓ భావోద్వేగ ప్రతికూల ప్రవర్తన. సహనం శాంతిని ప్రసాదిస్తుంది. సహనం సంస్కారాన్ని ద్విగుణీకృతం చేస్తుంది. సహనం సాఫల్య దరికి చేర్చుతుంది. సహనం సకల సుఖదాయకమే కాదు సుస్థిరాభివృద్ధికి ఊతం కూడా అవుతుంది. సహనం మనశ్శాంతికి సోపానం. ఓర్పు, సహనాలు శాంతి కపోతాల స్వేచ్ఛకు రెండు రెక్కలు. అసహన గుణం వల్ల కలిగే అనర్థాలపై విశ్వ మానవాళికి అవగాహన కల్పించాలని 1995లో నిర్ణయించుకున్నారు. దీని ప్రకారం 1996 నుంచి ప్రతి ఏటా యునెస్కో సారథ్యంలో నవంబర్‌ 16న ఐరాస సభ్య దేశాలు ‘అంతర్జాతీయ సహన దినోత్సవం (ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ టాలరెన్స్‌)’ పాటించటం ఆనవాయితీగా మారింది. విశ్వవ్యాప్తంగా మానవాళికి సహనగుణ ప్రాధాన్యాన్ని వివరించడానికి మహాత్మా గాంధీ 125వ జన్మదినం సందర్భంగా 1995 ఏడాదిని ‘సహన సంవత్సరం (ఇయర్‌ ఆఫ్‌ టాలరెన్స్‌)’గా కూడా పాటించడం మనకు తెలుసు.

శాంతి, సహనాలు తోబుట్టువులు
అనునిత్యం ప్రతి వ్యక్తికీ సహనం ఓ శాశ్వత గుణ ఆభరణం అవుతున్నది. సహనం, అహింసలే ప్రపంచ శాంతికి పునాదులని తెలుసుకోవాలి. వైజ్ఞానికశాస్త్రం, సాంస్కృతిక వారసత్వం, సకల కళలు, విద్యా బోధనలు, విజ్ఞుల ప్రవచనాలు లాంటివి సహనగుణ సంపద ప్రాధాన్యాన్ని వివరిస్తున్నాయి. సహనం మనకు ఓ మానవ హక్కుగా మారాలి. విద్యాలయాల్లో చిరుప్రాయం నుంచే సహనగుణం గూర్చి పాఠాలు నేర్పాలి. అసహన జ్వాలలు రేగితే శాంతి మటుమాయం అవుతుందని వివరించాలి. అసహనమే రక్తపాతాలకు కారణం అవుతుంది. అసహనంతో హింస జ్వాలలు ఎగిసి పడతాయి. సహనానికి తోబుట్టువు శాంతి అని తెలుసుకోవాలి. అసహనం విభేదాలకు ఆజ్యం పోసి, మానసిక శారీరక దూరాలను పెంచుతుంది. భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించడానికి ప్రయత్నిస్తున్న భారతదేశంలో సహనానికి పెద్ద పీట వేయాలి.

సహనశీలతే సద్గుణ సంపద
నేడు ప్రపంచ దేశాల మధ్య విభేదాలు భీకర అనర్థాలకు, యుద్ధాలకు దారితీయడం చూస్తున్నాం. మతం పూత పూసుకుంటూ, మత బోధనలను సంకుచిత ఆలోచనలతో వక్రీకరిస్తూ గొడవలకు దిగడం చూస్తున్నాం. మానవాళి శ్రేయస్సు, స్వేచ్ఛ, అభివృద్ధి, పరస్పర గౌరవం, శాంతియుత చర్చలు, సమన్వయ సహకార ధోరిణి, అర్థవంతమైన అంగీకార గుణం, ఇతరులను ప్రశంసించడం, ఇరుగు పొరుగు ఆచార వ్యవహారాలను గౌరవించడం, మాట్లాడే స్వేచ్ఛనివ్వడం లాంటివని సహనశీలత వల్ల ఒనగూడుతాయి. సహనం మన జీవన విధానంలో ఓ భాగం కావాలి. ఇతరులను సముచితంగా గౌరవించడం…వారి అభిప్రాయాలను అర్థం చేసుకోవడం, మానవ హక్కులను కాపాడడం లాంటివి సహనం ప్రసాదించిన సద్గుణాలని తెలుసుకోవాలి. సహనానికి విజ్ఞతతో హద్దులను ఏర్పరచుకోవాలి. అసహనం సదాలోచనలను మింగేస్తుంది.

ఈ సందర్భంగా…
”యునెస్కో-మదన్‌జిత్‌ సింగ్‌ పురస్కారాన్ని” సహనశీల వ్యక్తులు/సంస్థలకు రెండేళ్లకు ఒకసారి ఇవ్వడం పరిపాటి. అంతర్జాతీయ సహన దిన వేదికగా విద్యార్థులకు పలు పోటీల నిర్వహణ, సహనశీలత పట్ల ఉపన్యాసాలు, సహనగుణాన్ని పెంపొందించే కవితలు/నృత్య పోటీలు లాంటివి నిర్వహించవచ్చు. అణచివేత, అన్యాయాలను వ్యతిరేకించడం, సామాజిక మాద్యమాల్లో సహనగుణ ప్రచారం, సమాజంలో స్నేహశీలతను ప్రోత్సహించడం, క్షమాగుణాన్ని పెంపొందించుకోవడం, విజయ శిఖరాలను చేరడానికి సహనం సోపానంగా పని చేస్తుంది.
నాగరిక సమాజపు అసలైన లక్షణం సహనమని, తెలియని విషయాలను తెలుసుకోవడానికి ఉత్తమ మార్గం అని తెలుసుకోవాలి. సకల జనుల సంతోష సౌభాగ్యాలు సహనశీల సజ్జనుల ప్రవర్తనల నుంచి వర్షిస్తాయి. సహనం నేర్చుకోవడానికి ఓ అద్భుత అవకాశం అని కుటుంబ పెద్దలు, తల్లితండ్రులు, ఉపాధ్యాయులు సహన గుణాన్ని పిల్లలకు నేర్పడం మరువరాదు. సమసమాజం సహనశీల నీడలో సుఖశాంతులతో వెలసిల్లాలని కోరుకుందాం.
– మధుపాళీ, సెల్‌ : 9949700037

➡️