బీసీలకు వైసిపి ద్రోహం : టిడిపి

Nov 22,2023 00:22 #palnadu district

 

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : బీసీలకు రాజకీయంగా తోడ్పాటు అందించడంతో పాటు వారి ఆర్థికాభివృద్ధి టిడిపి ద్వారా సాధ్యమైందని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు అన్నారు. ‘బిసిలకు వైసిపి ద్రోహంపై ఐక్య పోరాటం’ పేరుతో నరసరావుపేట పట్టణంలోని జమీందారీ ఫంక్షన్‌ హాల్‌లో మంగళవారం జిల్లా స్థాయి రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. సమావేశానికి ఒంగోలు పార్లమెంటు అధ్యక్షులు నూకసాని బాలాజీ గౌరవ అధ్యక్షులుగా, బీసీ సాధికార సమితి ప్రధాన కార్యదర్శి వీరంకి వెంకట గురుమూర్తి పర్యవేక్షకులుగా, పల్నాడు బీసీ సెల్‌ అధ్యక్షులు మున్నా రాంబాబు అధ్యక్షునిగా వ్యవహరించారు. డాక్టర్‌ అరవిందబాబు మాట్లాడుతూ బీసీలకు వైసిపి పాలనలో జరిగినంత ద్రోహం, దగా, దాడులు, అరాచకాలు, హత్యలు బ్రిటీష్‌ పాలనలో కూడా జరగలేతన్నారు. బీసీలు బిక్కుబిక్కుమంటూ బతికే పరిస్థితి కల్పించారన్నారు. వాలంటీర్లతో వేధింపులకు పాల్పడే వైసిపికి బీసీల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధులివ్వలేదని 56 కార్పొరేషన్లు ఎవరి కోసం ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. అక్రమ కేసులు పెట్టి బీసీలను దగా చేసే వైసిపిని ఓడించేందుకు బీసీలంతా ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. నూకసాని బాలాజీ మాట్లాడుతూ వైసిపి పాలనలో సామాజిక న్యాయం లేదన్నారు. టిడిపి ప్రభుత్వంలో నామినేటెడ్‌ పదవుల్లో బీసీలకు అగ్రతాంబూలం ఇచ్చిందని, వైసిపి పాలనలో సలహాదారులు, యూనివర్శిటీ వీసీలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లలో బీసీలకు ఎందుకు అవకాశాలు తగ్గించారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రానున్న ఎన్నికల్లో నరసరావుపేట నియోజకవర్గ బీసీ అభ్యర్థి అరవిందబాబును గెలిపించాలని కోరారు. టిడిపి క్రమశిక్షణా సంఘం సభ్యులు జి.నాగేశ్వరరావు మాట్లాడుతూ బీసీలకు చెందిన దాదాపు 30 సంక్షేమ పథకాలు రద్దు చేశారని, బీసీలకు రిజర్వేషన్లు కుదించి రాజకీయంగా అణగదొక్కారన్నారని విమర్శించారు. వీరంకి వెంకట గురుమూర్తి మాట్లాడుతూ వైసిపి పాలనలో 74 మంది బీసీలను హత్య చేశారని, వేలాది మందిపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడ్డారని అన్నారు. సమావేశంలో వివిధ సంఘాలు, జనసేన పార్టీ నాయకులు పాల్గొనగా బీసీలకు జరిగిన అన్యాయం, దాడులు, హత్యలుకు సంబంధించి ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు.

➡️