సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీల ధర్నా

ప్రజాశక్తి – ఆకివీడు

తమకు తెలంగా ణలో ఇచ్చే జీతాల కంటే ఆంధ్రప్రదేశ్‌లో అధిక జీతాలు ఇస్తానని పాదయాత్రలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి జగన్‌ నేటికీ అమలు చేయలేదంటూ అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు నిరసన తెలిపారు. ఈ మేరకు ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీలు శుక్రవారం సాయంత్రం స్థానిక ప్రాజెక్టు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ యూనియన్‌ సంఘం నాయకురాలు పైడేశ్వరి అధ్యక్షతన జరిగిన సభలో సిఐటియు మండల కార్యదర్శి కె.తవిటినాయుడు మాట్లాడారు. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణకు కార్యకర్తలే పెట్టుబడులు పెట్టాల్సి వస్తోందన్నారు. రిటైర్మెంట్‌ వయసు 62కు పెంచాలన్నారు. కనీస వేతనం రూ.26 వేలు మంజూరు చేయాలన్నారు. సమస్యలు పరిష్కరించాలని 8వ తేదీ నుంచి అంగన్‌వాడీ కేంద్రాలను మూసివేసి నిరంతర సమ్మెకు కార్యకర్తలు దిగనున్నారని తెలిపారు. సమ్మెకు అందరూ మద్దతు తెలియజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పైడేశ్వరి, కృష్ణకుమారి, పి.శివలక్ష్మి, కృష్ణవేణి, రమాకుమారి, సీతామహాలక్ష్మి, ఇందిరాదేవి, నోము పాల్గొన్నారు.

➡️