యువత సోషల్‌ మీడియా మత్తులో పడొద్దు

యువత సోషల్‌ మీడియా మత్తులో పడొద్దు

ప్రజాశక్తి – నరసాపురం టౌన్‌

యువత సోషల్‌ మీడియా మత్తులో పడకుండా ఉండాలని బొమ్మిడి కృష్ణంరాజు ఎడ్యుకేషనల్‌ సొసైటీ ఛైర్మన్‌ బొమ్మిడి రవి శ్రీనివాస్‌ అన్నారు. గురువారం స్థానిక మీరా గ్రంథాలయానికి బొమ్మిడి కృష్ణంరాజు ఎడ్యుకేషనల్‌ సొసైటీ ఆధ్వర్యంలో రూ.25 వేల విలువ చేసే బీరువాతో పాటు రెండు ఐరన్‌ బుక్‌ స్టాల్స్‌ అందజేశారు. ఈ సందర్భంగా రవి శ్రీనివాస్‌ మాట్లాడుతూ నేటి యువత సోషల్‌ మీడియా మత్తులో పడి, అటు సమయాన్ని, ఇటు డబ్బును వృథా చేసుకుంటున్నారన్నారు. మంచి పుస్తకాలు చదవడం వల్ల ఆత్మస్థైర్యం పెరుగుతుందన్నారు. సమాజంలో గ్రంథాలయాలే దేవాలయాలని, గ్రంథాలయాల సేవలు వినియోగించుకుంటే బాల బాలికలు ప్రయోజకులు అవుతారని తెలిపారు. మీరా గ్రంథాలయ నిర్వాహకులు కవురు పెద్దిరాజు, ముచ్చర్ల త్రిమూర్తులు మాట్లాడుతూ రవి శ్రీనివాస్‌ ఆయన తండ్రి బొమ్మిడి కృష్ణంరాజు పేరు మీదుగా స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి సమాజానికి అందిస్తున్న సేవలను కొనియాడారు. అనంతరం రవి శ్రీనివాస్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పొగాకు నారాయణరావు, పొన్నాడ రాము, తెలగం శెట్టి సత్యనారాయణ, గంటా వేణు గోపాల్‌, బొడ్డు కృష్ణ భగవాన్‌, నాగిడి రాంబాబు పాల్గొన్నారు.

➡️