పాలకొల్లు
మహిళల అభ్యున్నతికి ఐద్వా కృషి చేస్తోందని ఐద్వా జిల్లా కార్యదర్శి పొగాకు పూర్ణ తెలిపారు. ఐద్వా జిల్లా కమిటీ సమావేశం పాలకొల్లు సమతా మహిళా భవన్‌లో మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి కేతా పద్మజ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి పొగాకు పూర్ణ మాట్లాడుతూ మహిళల సమస్యల పరిష్కారంలో ముఖ్య భూమిక పోషిస్తున్న మహిళా సంఘం 1938లో కృష్ణా జిల్లాలోని స్వతంత్ర ఉద్యమంలో భాగంగా ప్రారంభమైందని తెలిపారు. మహిళల హక్కులకు గౌరవం ఇవ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. 33 శాతం రిజర్వేషన్ అమలు చేయడానికి 2029 వరకూ సమయం తీసుకుంటామంటున్న బిజెపికి పట్టం కట్టాల్సిన అవసరం లేదన్నారు. స్త్రీలపై జరిగే సాంఘిక దురాచారాలను ఎదుర్కోవడంలో ఐద్వా ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, రైతు, మహిళా, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహిళల అభ్యున్నతికి ఐద్వా కృషి చేస్తోందని తెలిపారు. మహిళలకు అవకాశాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్.జయప్రభ, సిహెచ్.వరలక్ష్మి, హేమలత, సరోజిని, యశోద, ఎస్.ఉదరు కుమారి, సుగుణ రోజామణి పాల్గొన్నారు.