ప్రణాళికా బద్ధంగా పట్టణాభివృద్ధి

రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్‌ ముదునూరి ప్రసాదరాజు

ప్రజాశక్తి – నరసాపురం టౌన్‌

70 సంవత్సరాలుగా అంతంత మాత్రమే అభివృద్ధికి నోచుకున్న నరసాపురం పట్టణాన్ని ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చేయడం జరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్‌ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. నరసాపురం పురపాలక సంఘం పరిధిలో శ్రీహరిపేట సచివాలయం పరిధిలో 1, 2, వార్డులకు సంబంధించి శుక్రవారం జరిగిన వై ఎపి నీడ్స్‌ జగన్‌ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. నరసాపురం మున్సిపాల్టీ ఏర్పడి 70 సంవత్సరాలైందన్నారు. తాగునీరు ప్రజలకు అందించాలని పట్టణంలో రూ. 82 కోట్లతో శాశ్వత పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. రూ.84 కోట్లతో అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ నిర్మాణ పనులను త్వరలో చేపడతామన్నారు. పట్టణంలో అంతంత మాత్రంగానే ఉన్న బస్టాండు, ప్రభుత్వాసుపత్రి, ప్రజలు ఆహ్లాదంగా గడిపేందుకు కాటన్‌ పార్క్‌ను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. గడిచిన నాలుగున్నరేళ్లలో రెండు వార్డుల్లో కలిపి రూ.32.81 కోట్లతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశామన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి డ్వాక్రా రుణాలను అందించి వారు కట్టాల్సిన బ్యాంకు వడ్డీని కూడా ప్రభుత్వమే భరించి నాలుగు విడసలుగా కట్టడం జరుగుతోందన్నారు. ముందుగా అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి, ఒకటి రెండు వార్డులో జరిగిన అభివద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రగతి వివరాలు తెలిపే డిస్‌ప్లే బోర్డును ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నరసాపురం మున్సిపల్‌ ఛైర్‌ పర్సన్‌ బర్రె శ్రీ వెంకటరమణ, మున్సిపల్‌ కమిషనర్‌ కె.వెంకటేశ్వరరావు, భూసారపు జయప్రకాష్‌, వైకెఎస్‌ బొంతు రాజశేఖర్‌ పాల్గొన్నారు.

➡️