నిబద్ధతతో పనిచేస్తే ఫలితాలు సాధ్యం

రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి కృష్ణమోహన్‌

ప్రజాశక్తి – భీమవరం

నిబద్ధతతో పని చేసినప్పుడే మంచి ఫలితాలు సాధించగలమని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్‌ జడ్జి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ అన్నారు. పట్టణంలోని శ్రీరామపురం బిఎస్‌ఎన్‌ఎల్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక జిల్లా న్యాయస్థానాల సముదాయాలను హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ కృష్ణమోహన్‌, జస్టిస్‌ ఎవి.శేషసాయి సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణమోహన్‌ మాట్లాడుతూ భీమవరం వాసుల ఆప్యాయత మరువలేనిదన్నారు. తాత్కాలిక కోర్టు సముదాయం చాలా బాగా తయారైందని, శాశ్వత భవనాలు మరింత అందంగా ఉంటాయనడంలో సందేహం లేదన్నారు. త్వరలో నూతనంగా నిర్మించబోయే న్యాయస్థానం సముదాయానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తి వెంకట శేష సాయి మాట్లాడుతూ న్యాయవాద వృత్తిలో తపన, కష్టపడి పనిచేసే తత్వం, నిబద్ధత ఉన్నప్పుడే రాణించగలమన్నారు. భీమవరం వాసిగా మీ అందరి అభిమానానికి పాత్రుడనయ్యాని తెలిపారు. ప్రాథమిక దశలో పనిచేస్తున్న జ్యుడీషియల్‌ ఆఫీసర్లు నరసాపురంలో పనిచేస్తే సివిల్‌ వర్క్‌ బాగా వస్తుందని సూచించారు. ఉభయ పశ్చిమగోదావరి జిల్లాల ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జి సి.పురుషోత్తం కుమార్‌ మాట్లాడుతూ భీమవరం న్యాయస్థానాల సముదాయాన్ని తాత్కాలికంగా బిఎస్‌ఎన్‌ఎల్‌ ప్రాంగణానికి తరలించే క్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు అందించిన సహకారం మరువలేనిదన్నారు. అనంతరం కోర్టు సముదాయం ఏర్పాటుకు కాంట్రాక్టర్‌, ఆర్‌అండ్‌బి అధికారులు, కోర్టు సిబ్బందిని సత్కరించారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమవరం మండల న్యాయ సేవా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో భీమవరం మూడో అడిషనల్‌ డిస్టిక్‌ జడ్జి పి.శ్రీసత్యదేవి, సీనియర్‌ సివిల్‌ జడ్జి బి.అప్పలస్వామి, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి పి.పవన్‌కుమార్‌, ఫస్ట్‌ అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి జి.సురేష్‌ బాబు పాల్గొన్నారు.భీమవరం కోర్టులకు వందేళ్ల చరిత్ర బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వెంకటరమణ రావు భీమవరం కోర్టులకు వందేళ్ల చరిత్ర ఉందని భీమవరం బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మొగళ్ల వెంకట రమణారావు అన్నారు. కోర్టు సముదాయాల ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. గూడూరి రంగారావు, నూకల రామానుజరావు, తాడిమళ్ల జగన్నాథరావు వంటి లబ్ధప్రతిష్టులు ఎందరో ఇక్కడ న్యాయవాద వృత్తి చేపట్టి ఈ ప్రాంతానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చారన్నారు. భీమవరం డిఎన్‌ఆర్‌ కళాశాలలో లా కాలేజీ కూడా ఉండడంతో ఏటా కొంత మంది లాయర్లు తయారవుతున్నారని తెలిపారు.

➡️