ప్రజాశక్తి – ఉండి
అసలే ఇరుకు వంతెన ఆపై నిత్యం ట్రాఫిక్ సమస్యతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ప్రజలు చెబుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఉండి మెయిన్ సెంటర్ నాలుగు రోడ్ల కూడలి కావడం ఆపై నిత్యం ట్రాఫిక్ సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం సాయంత్రం 108 ట్రాఫిక్ లో ఇరుక్కుపోయింది. 108 వాహనం డ్రైవర్ ఎంత హారన్ మోగించినా చాలాసేపటి వరకూ ఉపయోగం లేకపోయింది. ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనాలు రాకపోకలకు ఇబ్బందికి గురయ్యారు. రోడ్డుకు ఆనుకొని బ్యానర్లు కట్టడం, చిరు వ్యాపారస్తులు రోడ్లపైనే వ్యాపారాలు చేయడం ద్వారా ట్రాఫిక్‌కు నిత్యం అంతరాయం కలుగుతుందని స్థానికులు వాపోతున్నారు. గతంలో ఉండి మెయిన్ సెంటర్లో పోలీసులు వాహన రాకపోకలను నియంత్రించే వారిని, కొద్ది నెలల నుంచి ఉండి మెయిన్ సెంటర్లో పోలీసులు ట్రాఫిక్ నియంత్రించడంలో ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అలాగే సాయంత్ర వేళలో స్కూల్ బస్సులు ఒకే సమయానికి రావడంతో ఉండి మెయిన్ సెంటర్లో ట్రాఫిక్ సమస్య ఎక్కువ అవుతోందని ఇప్పటికైనా ఉండి మెయిన్ సెంటర్లో పోలీసులను ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్యను తీర్చాలని, వంతెన నిర్మాణాన్ని చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.