ప్రజాశక్తి – భీమవరం రూరల్
కర్రీ పాయింట్లు రోజురోజుకూ పుట్టగొడుగుల మాదిరిగా పెరిగిపోతున్నాయి. కస్టమర్లను ఆకట్టుకునేందుకు షాపు యజమానులు ప్రమాదకరమైన రసాయనాలు, కల్తీ నూనెలు, రంగులు, టేస్టింగ్ సాల్ట్ వంటివి వంటల్లో వాడేస్తున్నారు. ఇది ప్రజల ఆరోగ్యంపై పెనుప్రమాదం చూపుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.నేటి ఆధునిక యుగంలో పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, పిల్లల చదువులు, ఇంటి అద్దె ఇతర ఖర్చులు సామాన్య, మధ్య తరగతి కుటుంబాలను ఆర్థిక ఇబ్బందుల్లో నెట్టేసి చిన్నాభిన్నం చేస్తున్నాయి. దీంతో భార్యాభర్తలు పనిచేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే విద్యావంతులైన మహిళలు వారికి తగ్గ ఉద్యోగాలు చేస్తుంటే, కొంత మంది షాపింగ్ మాల్స్, ప్రయివేటు సెక్టార్లలో పనిచేస్తున్నారు. అయితే అక్కడ పనిచేసి రాత్రి 9 గంటల సమయంలో ఇంటికి వెళ్లి వంట చేయడానికి సమయం లేక కర్రీ పాయింట్ల నుంచి కూరలు కొనుగోలు చేస్తున్నారు. ఇది వ్యాపారవేత్తలకు ముఖ్యంగా హోటల్స్ యజమానులకు వరంగా మారింది.జిల్లాలో భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తాడేపల్లిగూడెం వంటి పట్టణాలతో పాటు నేడు గ్రామాల్లో సైతం ఈ కర్రీ పాయింట్లు పెద్ద ఎత్తున విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వ్యాపారం బాగానే సాగుతోందని చెప్పొచ్చు. ఇంత వరకూ బాగానే ఉన్నా అధిక లాభాలు ఆర్జించాలనే ఉద్దేశంతో కొందరు కర్రీ పాయింట్ల వ్యాపారులు కల్తీ నూనె వాడుతున్నారు. అంతేకాకుండా కాల పరిమితి అయిపోయిన నూనెలను పెద్దపెద్ద మాల్స్ వద్ద కొనుగోలు చేసి వంటల్లో వినియోగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వాటితో పాటు కూరగాయలను సైతం మార్కెట్ అయిపోయిన తర్వాత వినియోగదారులు కొనగా మిగిలిన వాటిని తక్కువ ధరకు తెచ్చి వండేస్తున్నారు. ముఖ్యంగా చికెన్, మటన్, పీతలు, రొయ్యలు, చేపలు వంటి మాంసాహార కూరలు సైతం విరివిగా అమ్ముతున్నారు. అయితే ఈ కూరల్లో టేస్టింగ్ సాల్ట్, కలర్ వాడేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎక్కడ తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. దీనికి కారణం అధికారులు మామూళ్లు తీసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికితోడు మిగిలిపోయిన కూరలు ఫ్రిజ్‌లో పెట్టి మరుసటి రోజు వేడిచేసి అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారని బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఈ కూరలు తిని ప్రజలు రోగాల బారిన పడి ఆసుపత్రులకు వేలకు వేలు ఖర్చు చేస్తున్నారు. ఏదేమైనా ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు ఎటువంటి తనిఖీలు చేయకపోవడం దారుణమని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు హోటళ్లుపై, కర్రీ పాయింట్లపై దృష్టి సారించి కల్తీ నూనెల వాడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.