ప్రజాశక్తి – వీరవాసరం
ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన సిపిఎం మండల నాయకులు కిల్లాడి అప్పారావు ధన్యజీవి అని సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ ఎంపిపి జుత్తిగ నరసింహమూర్తి అన్నారు. కొణితివాడ ఉత్తరపాలెంలోని బిసి కమ్యూనిటీ హాల్లో కిల్లాడి అప్పారావు 4వ వర్థంతి సభ శుక్రవారం నిర్వహించారు. సభకు సిపిఎం ఉత్తరపాలెం శాఖా కార్యదర్శి కేతా జ్యోతిబసు అధ్యక్షత వహించారు. ముందుగా అప్పారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో జుత్తిగ నరసింహమూర్తి మాట్లాడారు. పేద ప్రజల హక్కుల కోసం, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అప్పారావు కృషి చేశారన్నారు. కొణితివాడలోని ప్రభుత్వాసుపత్రి తరలిపోతుంటే అడ్డుకుని ఆసుపత్రి కొణితివాడలోనే ఉండేలా జరిగిన ఉద్యమంలో ఆయన ముందు నిలబడి పని చేశారన్నారు. 40 సంవత్సరాల పాటు సిపిఎం సభ్యుడిగా కొనసాగిన అప్పారావు అనేక ప్రజా సమస్యల పరిష్కారం కోసం తుది శ్వాస వరకూ పనిచేశారని చెప్పారు. రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ తన తండ్రి అప్పారావు ఇచ్చిన స్ఫూర్తి ప్రోత్సాహంతోనే ప్రజా ఉద్యమాల్లో పనిచేస్తున్నానని వివరించారు. సిపిఎం మండల నాయకులు బాలం విజరు కుమార్ మాట్లాడారు. కార్యక్రమంలో కొణితివాడ, ఉత్తరపాలెం, నవుడూరు, అండలూరు గ్రామాలకు చెందిన సిపిఎం నాయకులు కడలి వీరన్నశెట్టి, పాలా అజరు ఘోష్, పాలా కోటేశ్వరరావు, నున్న బోయిన సత్యనారాయణ, యాళ్ల బండి నారాయణ మూర్తి పాల్గొన్నారు.