సాగుదారులకు పట్టాలివ్వండి : వ్యకాసం

Nov 16,2023 22:01 #Sri Satya Sai District

పుట్టపర్తి అర్బన్‌ : జిల్లాలో పేదల స్వాధీన అనుభవంలో ఉన్న ప్రభుత్వ వ్యవసాయ సాగు భూములకు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న భూపంపిణీలో అసైన్మెంట్‌ హక్కులు కల్పించాలని శ్రీసత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు వ్యకాసం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రవీణ్‌కుమార్‌, పెద్దన్నలు గురువారం నాడు విజయవాడలో భూపరిపాలన ముఖ్య అధికారిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెనుకొండ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని వివిధ మండలాల్లో భూములు లేని దళిత, గిరిజన, బలహీన వర్గాల నిరుపేద కుటుంబాలు దశాబ్దాలు తరబడి ప్రభుత్వ అసైన్‌మెంట్‌ మిగులు భూముల్లో సాగు చేసుకుంటున్నారన్నారు. ఈ భూములను సాగులోకి తెచ్చేందుకు లక్షల రూపాయలు ఖర్చు చేశారన్నారు. ఇలాంటి వారికి ఆ భూమిపై హక్కులు కల్పిస్తూ పట్టాలు మంజూరు చేయాలన్నారు. రొద్దం మండలం కోగిర రెవెన్యూ పొలం సర్వే నెం. 669, గొందిపల్లి రెవెన్యూ పొలం సర్వే నెం164, సోమందేపల్లి మండలం పందిపర్తి రెవెన్యూ పొలం సర్వే నెం.384, తుంగోడు రెవెన్యూ పొలం సర్వే నెం. 28, లేపాక్షి మండలం కొర్లకుంట, కొండూరు తదితర ప్రాంతాల్లో పేద సాగుదారులు సాగులో ఉన్నారన్నారు. ఇప్పటికే పేదలకు న్యాయం చేయాలని జిల్లాలోని రెవెన్యూ సంబంధిత అధికారులందరికీ వినతిపత్రాలు అందిచామన్నారు. ఈ మేరకు రైతులను గుర్తించి వారందరికీ సాగు పట్టాలు ఇచ్చి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

➡️