మోదీ హోదా ఏదీ..?దశవాతారున్ని సాక్షిగా దశాబ్దంప్రజాశక్తి- తిరుపతి సిటి విభజన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకునేందుకు ప్రత్యేక హోదా ఇస్తామన్న బిజెపి, ప్రధాని నరేంద్రమోదీ ఆ మాటను విస్మరించారు. దశవాతారుడైన శ్రీవెంకటేశ్వరస్వామి పాదాలు సాక్షిగా ఇచ్చిన మాటకు దశాబ్దం అవుతున్నా అమలు చేసిన పాపాన పోలేదు. నేడు ఏ మోహం పెట్టుకుని తిరుపతికి వస్తున్నాడని సామాన్యుడు సూటిగా ప్రశ్నిస్తుండడం గమనార్హం. అది 2014 దేశవ్యాప్తంగా సాధారణ ఎన్నికలు జరుగుతున్న రోజులు. అప్పటి హైదరాబాదు రాజధానికిగా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ విడగొట్టి. తెలంగాణ, విభజన ఆంధ్రప్రదేశ్‌గా మార్చింది. పార్లమెంట్ చీకటి గదుల్లో జరిగిన చట్టానికి అన్ని రాజకీయ పార్టీలు పరోక్షంగా, ప్రత్యేక్షంగా మద్దతు తెలిపిన వారే (ఒక సిపిఎం తప్పా). ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తున్నట్లు అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ పార్లమెంట్‌సాక్షిగా ప్రకటించారు. దీంతో పాటు మరెన్ని విభజన హామీలు ఇచ్చారు. అప్పడు రాష్ట్రానికి చెందిన టిడిపి, బిజెపి సైతం ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కావాలని డిమాండు చేశాయి. ఈ నేపథ్యంలో సాధారణ ఎన్నికలో రానే వచ్చాయి. ఏపిలో భారతీయ జనతాపార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు కలిసి పోటీకి దిగాయి. ఈ సందర్భంగా ప్రపంచ ప్రసిద్దిగాంచిన తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రంలోని శ్రీవెంకటేశ్వరస్వామి పేరుతో వెలిసిన శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం క్రీడామైదానంలో జరిగిన ఎన్నికల సభకు ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడి ముఖ్యఅతిథిగా హజరయ్యారు. తిరుమల శ్రీవారిని దర్శంచుకుని, తిరుపతికి చేరుకుని సభలో ప్రసంగిస్తూ తిరుమల శ్రీవారి పాదాల సాక్షిగా త్రాను అధికారంలోకి వస్తే ఏపికి ప్రత్యేక ఇస్తానని హామీ ఇచ్చారు. అప్పడే ఆదే వేదికపై టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్‌కల్యాణ్ కూడా ఉన్నారు. క్యాలెండరు తిరగబడింది. 2019 ఎన్నికలు వచ్చేసరికి బిజెపిని జనసేనాని విమర్శించారు. తిరుపతి సాక్షిగా ఏపికి మోదీ పాసిపోయిన లడ్డులు ఇచ్చాడని ఎద్దేవా చేశారు. మమ్మల్ని బిజెపి మోసం చేసింది. ఆయనదన్ని అపద్దాల హామీలే అంటూ టిడిపి తూర్పార పట్టింది. మళ్లీ ఎన్నికల క్యాలెండరు మారింది. మరో కొన్ని నెలల్లో ఏపిలో ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పడు మళ్లీ కప్పదాటు చేస్టాలు తప్పడం లేదు. బిజెపిని పాసిన లడ్డులు అన్న పవన్ కల్యాణ్ అంటపెట్టుకున్ని, పొత్తు పెట్టుకున్నాడు. టిడిపితో సైతం బిజెపికి పొత్తు పెట్టుకునేలా అనేక చర్చలు జరుగుతున్న విషయం జగమోరిగిన సత్యం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల సభలో పాల్గొంటున్న ప్రదాని నరేంద్ర మోదీ పనిలో పనిగా ఆదివారం తిరుపతికి చేరుకుని, తిరుమల శ్రీవారిని దర్శించుకుని, తిరిగి తెలంగాణకు వెళ్లి ఎన్నికల సభల్లో పాల్గొంటారు. ఇదే తిరుపతికి సాక్షిగా నరేంద్రమోడి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీకి సుమారు దశాబ్దం అవుతోంది. హోదానే కాదు. ప్రత్యేక ఫ్యాకేజీ, రాయలసీమకు, వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతాలకు నిధులు ఇవ్వలేదు. జాతీయ ప్రాజెక్టుగా చెప్పతున్న పోలవరానికి నిధులు కూడా అంతంత మాత్రమే. కడప ఉక్కు ఫ్యాక్టరీ ఊసే లేదు. విశాఖ రైల్వే డివిజన్ లేదు. సంవత్సరానికి కోటి ఉద్యోగాలు లేవు. రాష్ట్ర రాజధాని నిర్మాణానికి సహయం లేదు. అంతెందుకు ఏడాదికి లోటుగా ఉంటున్న 16వేల కోట్ల రూపాయలలో సైతం పైసా ఇచ్చిన దాఖలాలు లేవు. విభజన హామీలన్ని నీటి మూటలయ్యాయి. దీనికి తోడు కొత్తగా ఏమి ఇవ్వకపోగా ఆంధ్రరాష్ట్రానికే తలమానికమైన విశాఖ ఉక్కును సైతం కార్పొరేట్ శక్తులకు అప్పగించారు. ప్రభుత్వరంగ సంస్థలను (రైల్వే, ఎల్‌ఐసి, బ్యాంకులు, విమానశ్రయాలు, పోర్టులు) ప్రయివేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారు. ఇదేమని ఆడిగే నాథుడే లేడు. అధికారంలో ఉన్న వైసిపి, ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి, మిత్రపక్షమైన జనసేన ముగ్గురు ముగ్గురే. మోదీకి మోకరెళ్లడంలో ఎవ్వరికి వారు పోటీ పడుతూనే ఉన్నారు. ఇక ప్రశ్నించే దిక్కేది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే స్థితి ఏది. తిరుపతి సాక్షిగా ప్రత్యేకహోదా ఇచ్చిన నరేంద్ర మోదీ దశాబ్ధాం తర్వాత శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనానికి ఆదివారం తిరుపతికి రానున్న సందర్భంగా తిరుపతి వాసులు, ఆంధ్ర ప్రజలు తమకు ఇచ్చాన హామీలను అమలు చేయకుండా ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి ఎన్నికల రాజకీయాలు మానీ, ప్రజా సంక్షేమాన్ని, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని, రానున్న ఎన్నికల సమయంలోపు రాష్ట్రానికి ప్రత్యేకహోదా ప్రకటించాలని, విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే ఉంచాలని, విభజన హామీలను ఖచ్చితంగా అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.