పనులు చేస్తాం.. బిల్లుల మాటేంటి.?

Nov 27,2023 21:54
పనులు చేస్తాం.. బిల్లుల మాటేంటి.?

– పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని వైసిపి సర్పంచ్‌ల ధ్వజం- సర్వసభ్య సమావేశంలో అధికారులను నిలదీతప్రజాశక్తి-గంగాధరనెల్లూరుపనులు చేయమంటారు.. ప్రజా అవసరాలు తీర్చమంటారు.. కాదనలేని పరిస్థితిలో చేతినుంచి పెట్టుకొని గ్రామాల్లో సమస్యలు తలెత్తకుండా చేస్తున్నాం.. ఖాతాల్లో డబ్బులు లేక.. పెండింగ్‌ బిల్లులు చెల్లించక అవస్థలు పడుతున్నామని అధికార వైసిపి సర్పంచ్‌లు సర్వసభ్య సమావేశంలో అధికారులను నిలదీశారు. సోమవారం గంగాధరనెల్లూరు మండల సాధారణ సర్వసభ్య సమావేశం ఎంపిపి అనిత అధ్యక్షతన జరిగింది. ప్రభుత్వ పరమైన పనులు చేయమని అధికారులు ఒత్తితెస్తారని తీరా చేసిన పనులకు బిల్లులు చెల్లించక పోవడం దారుణమని పెద్దకాల్వ సర్పంచ్‌ ఏకాంబరం ప్రశ్నించారు. పంచాయతీకి వచ్చే నిధుల్లో కొంత గ్రీన్‌ అంబాసిబర్ల వేతనాలకు, మిగిలిన మొత్తం తాగునీటి ట్యాంకులు పరిశుభ్రం చేయాలని అధికారులు చెప్తున్నారు, పెట్టిన ఖర్చులు చెల్లించరెందుకని వెజ్జుపల్లి సర్పంచ్‌ హరిప్రసాద్‌ నిలదీశారు. చిన్న వేపంజేరి ఎంపిటిసి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ గ్రామంలో 11కెవి లైన్‌ సమస్య దీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోలేదని, వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్‌ బిందుమాలతి మాట్లాడుతూ అన్నిరకాల సౌకర్యాలతో అంగన్వాడీ కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. వెటర్నరీ డాక్టర్‌ నాగాంజనేయులు మాట్లాడుతూ పాడిఆవులకు అమ్మోరు సోకుతున్నాయని, అలాంటి పశువులను గుర్తించి వెంటనే వెటర్నరీ అధికారులకు తెలియజేయాలన్నారు. సమావేశంలో ప్రజాప్రతినిధులు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు పరిష్కరిస్తారని తెలిపారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి హరిబాబు, బేబి, ఎపిఎం చిరంజీవి, ఏపివో శ్రీనివాసులు, ఎంఈవో గుణశేఖర్‌రెడ్డి, హౌసింగ్‌ ఎఈ దాము, వ్యవసాయ అధికారి వందన తదితరులు పాల్గొన్నారు.

➡️