పత్యామ్నాయం కమ్యూనిస్టులే..ప్రజాశక్తి- శ్రీకాళహస్తి: ప్రమాదంలో పడ్డ దేశభవిష్యత్తు, లౌకికవాదం, ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఏకైక రాజకీయ ప్రత్యామ్నాయం కమ్యూనిస్టులేనని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అంగేరి పుల్లయ్య అన్నారు. స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవన్లో ఆదివారం శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల ముఖ్య నేతల స్టడీ సర్కిల్ జరిగింది. ఈ సందర్భంగా ఈ నెల 19న విజయవాడలో నిర్వహించిన ప్రజారక్షణ భేరి సభ ముఖ్య ఉద్దేశాలు, ప్రజాప్రణాళికపై చర్చించడం జరిగింది. మోదీ పాలనలో దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి కార్పొరేట్లకు కాపు కాయడమే మోదీ పని అని విమర్శించారు. మోదీ పాలనలో రైతులు, కార్మికులు, ఉద్యోగులు, సామాన్యుల జీవితాలు రోడ్డున పడ్డాయని వాపోయారు. మతవిద్వేష రాజకీయాలు చేస్తూ రాజ్యాధికారం దక్కించుకోవడమే బీజేపీ ప్రధాన అజెండా అని ఆరోపించారు. కేరళ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని తక్కిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు మోదీకి వ్యతిరేకంగా పాలన సాగించాలని సూచించారు. గంధం మణి, పెనగడం గురవయ్య, రమణయ్య, నాగరాజు, వెలివేంద్రం తదితరులు పాల్గొన్నారు.