ఎస్వీయూకు నాక్ ‘ఏ’ ప్లస్ గ్రేడ్ : వీసీప్రజాశక్తి – క్యాంపస్ ఎస్వీ యూనివర్సిటీకి యుజిసి నాక్ ఏ ప్లస్ గ్రేడ్ లభించిందని వీసీ ప్రొఫెసర్ కె రాజారెడ్డి వెల్లడించారు. యూనివర్సిటీకి ప్రతిష్టాత్మక యూజీసీ నాక్ ఏ ప్లస్ గ్రేడ్ లభించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో నాక్ ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ ను యూనివర్సిటీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. యూనివర్సిటీలోని వివిధ కాలేజీలు, విభాగాలు బోధన, పరిశోధన, విస్తరణ రంగాల్లో అత్యద్భుతమైన ప్రగతిని సాధించాయని చెప్పారు. దీనిని గుర్తించి నాక్ బందం ఏ ప్లస్ గ్రేడ్ ప్రకటించిందని తెలిపారు. ముఖ్యంగా సైన్స్ లోని ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో కెమిస్ట్రీ తదితర విభాగాలు సుమారు రూ. 100 కోట్ల పరిశోధన ప్రాజెక్టులు నిర్వహిస్తున్నాయని చెప్పారు. యూనివర్సిటీలోని అధ్యాపకులకు మూడు దశలుగా సిఏఎస్ ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగోన్నతులు కల్పించామని తెలిపారు. అకడమిక్ కన్సల్టెంట్లు, టైం స్కేల్ ఎన్ ఎం ఆర్ ఉద్యోగులకు వేతనాలు పెంచామని అన్నారు. బోధనేతర ఉద్యోగులకు పరీక్షలు నిర్వహించి ఉద్యోగోన్నతి కల్పించినట్టు చెప్పారు. హోం సైన్ విభాగంలో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు రూ. 10 కోట్లు కేటాయించారని తెలిపారు. ఇందులో రూ. 5 కోట్లు తొలి దశ నిధులు మంజూరైనట్టు వివరించారు. ప్రత్యేకంగా పరీక్షల విభాగం భవనం రూ. 7 కోట్లు తో నిర్మించినట్టు చెప్పారు. రూ. 7 కోట్లతో బాలికల హాస్టల్, రూ. 7 కోట్లతో బాలుర హాస్టల్ భవనాల్ని పూర్తి చేసినట్టు తెలిపారు. రూ. 2.5 కోట్ల వ్యయంతో ఫార్మసీ కాలేజీ మొదటి అంతస్తు భవన నిర్మాణం చేపడుతున్నట్టు చెప్పారు. ఇంజనీరింగ్ కాలేజీలో పూర్వవిద్యార్థుల సహకారంతో 500 మంది అమ్మాయిలకు వసతి సదుపాయం కోసం హాస్టల్ భవనాన్ని నిర్మిస్తున్నట్టు తెలిపారు. నూతన జాతీయ విద్యా విధానం- 2020 ను పటిష్టంగా అమలు చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 110 కోట్లు అదనపు నిధులు సమీకరించి రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించవలసిన అన్ని రకాల బకాయిల్ని అందించినట్లు తెలిపారు. అకడమిక్ కన్సల్టెంట్లకు 110 అమలు చేశామని ఎస్వియూ రిజిస్ట్రార్ వెల్లడించారు. తన మూడేళ్ల పదవీకాలంలో తనకు అన్ని విధాలుగా సహకరించిన విద్యార్థులు, ఉద్యోగులు, అధికారులకు ఈ సందర్భంగా వీసీ రాజారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ హుస్సేన్, డీన్ ప్రొఫెసర్ విజయభాస్కరరావు, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పద్మనాభం, వైస్ ప్రిన్సిపల్ శ్యామ్ డేవిడ్ మోహన్ కుమార్ రాజు, పాలకమండలి సభ్యులు మంజుల, సుమకిరణ్ పాల్గొన్నారు..ే