దేశ ఆర్థిక అభివృద్ధిలో మహిళా పారిశ్రామిక వేత్తల పాత్ర కీలకం

Nov 18,2023 13:38 #ntr district
  • ఎన్టీఆర్‌ జిల్లా సబ్‌ కలెక్టర్‌ అథితిసింగ్‌

ప్రజాశక్తి – ఎడ్యుకేషన్‌ : ఆర్థిక సంస్కరణల అనంతరం దేశంలో మహిళా పారిశ్రామికవేత్తల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని ఎన్టీఆర్‌ జిల్లా సబ్‌ కలెక్టర్‌ అథితి సింగ్‌ అన్నారు. కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఉమెన్‌ ఎంటర్‌ ప్రెన్యూర్‌ (కొవే) ఆధ్వర్యంలో నగరంలోని ఒక హౌటల్లో శుక్రవారం జరిగిన మహిళా పారిశ్రామిక వేత్తల సత్కార కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యాధికులైన మహిళలు ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా మరి కొంతమందికి ఉపాధి కల్పించేందుకు కషి చేయాలని కోరారు. ఒక మహిళ పారిశ్రామికవేత్తగా ఎదిగితే మరెంతోమంది మహిళలకు ఉపాధి కల్పించేందుకు అవకాశం ఉంటుందని గుర్తు చేశారు. తద్వారా ఆయా కుటుంబాలు ఆర్థికంగా ఎదగడమే కాకుండా వారి వారి కుటుంబాలలోని సంతానం కూడా విద్యాధికులుగా తయారవుతారన్నారు. దేశంలో పెరుగుతున్న ఆర్థిక అభివద్ధిలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. కిరణ్‌ మజుందార్‌ షా, ఇంద్రా నూయి వంటి సాధారణ మహిళలు పారిశ్రామిక వేత్తలుగా మారిన తర్వాత దేశంలోనే అత్యంత శక్తివంతమైన మహిళలుగా ప్రసిద్ధి చెందారన్నారు. అటువంటి శక్తి కలిగిన మహిళలను స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని సూచించారు. సమాజంలో నిరంతరం వస్తున్న మార్పులను మహిళా పారిశ్రామిక వేత్తలు గుర్తించి మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా పరిశ్రమలు స్థాపిస్తే స్వల్ప కాలంలోనే విజయం సాధించవచ్చన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా పారిశ్రామికవేత్తల ఆర్థిక అభివద్ధికి ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నాయని, అటువంటి అంశాలను నిరంతరం అధ్యయనం చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఖాదీ అండ్‌ విలేజ్‌ ఇండిస్టీస్‌ బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారి వి ఆర్‌ విజయ రాఘవ నాయక్‌ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో కుటీర పరిశ్రమల అభివద్ధి కోసం సంస్థ చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఏపీ చాంబర్స్‌ ప్రెసిడెంట్‌ పొట్లూరు భాస్కరరావు మాట్లాడుతూ తమ ఛాంబర్‌ లో ఉన్న ఎన్నో అనుబంధ విభాగాలలో మహిళా పారిశ్రామికవేత్తల సమాఖ్య ఎంతో ఉత్తేజితంగా పనిచేస్తోందన్నారు. అనంతరం వివిధ రంగాలలో ప్రతిభా పాటవాలను చాటిన 125 మంది మహిళా పారిశ్రామికవేత్తలను సత్కరించారు. కార్యక్రమంలో కొవే ఇండియా చైర్‌ పర్సన్‌ పి.సౌదామిని, జాతీయ అధ్యక్షురాలు ఆలూరి లలిత, రాష్ట్ర అధ్యక్షురాలు రాధిక ఇతరులతో సహా వ్యాపార, తయారీ రంగాలకు చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

➡️