విద్యార్ధులు సమాజానికి ఉపయోగపడేలా తయారవ్వాలి

Nov 30,2023 16:24 #Krishna district
  • ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ఆచార్య హేమచంద్రరెడ్డి
  • అట్టహాసంగా ప్రారంభమైన కృష్ణా తరంగ్‌ 2023
  • భారీ సంఖ్యలో విద్యార్థుల రిజిస్ట్రేషన్లు

ప్రజాశక్తి-రుద్రవరం : విద్యార్ధులు తాము సమాజానికి ఏ విధంగా ఉపయోగపడగలమో ఆలోచించాలని, అలా అలోచించిన విద్యార్థులే మంచి భవిష్యత్‌ను ఆస్వాదిస్తారని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ఆచార్య హేమచంద్రరెడ్డి పేర్కొన్నారు. గురువారం కృష్ణా విశ్వవిద్యాలయంలో కృష్ణా తరంగ్‌ 2023 ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కేవలం చదువుకోవడం వల్ల ఉద్యోగం చేయడానికి మాత్రమే మనిషి ఉపయోగపడతారు గానీ సంపూర్ణ వ్యక్తిగా రూపాంతరం చెందలేరన్నారు. విద్యార్థులు తమలో దాగి ఉన్న చెడు అలవాట్లను ధ్వంసం చేయకుండా మార్పు చెందిన మనిషి కాలేరని హితవు పలికారు. ఓటమి, సంక్షోభం,సంఘర్షణ అనేవి జీవితంలో భాగమేనని వాటి నుండి బయటకు వచ్చినప్పుడు విజయం వైపు వెళ్లగలమన్నారు. అద్దం మీద మురికి పడితే ముఖం ఎలా కనపడకుండా వుంటుందో మనలో కొన్ని కోరికలు తొలగించుకున్నప్పుడే భవిష్యత్తు వుంటుందన్నారు.ఉపకులపతి ఆచార్య జి జ్ఞానమణి మాట్లాడుతూ.. నిర్ణయం తీసుకున్న పది రోజుల స్వల్ప సమయంలో కృష్ణా తరంగ్‌3023 ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థుల్లో ఐక్యత, స్నేహభావం పెంపొందించుకోవడం కోసం ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయి అని చెప్పారు. గెలుపు, ఓటములు సహజమే అయినప్పటికీ పోటీలలో పాల్గొనడం అలవాటు చేసుకోవడం మంచిదన్నారు. మాజీ శాసన సభ్యులు ఎన్‌ శేషరెడ్డి మాట్లాడుతూ.. నిత్యం మార్కులు, ర్యాంకులు గురించి ఆలోచించకుండా అన్ని రంగాలలో అభివద్ధి చెందాలనే తపనతో కష్టపడే తత్వం అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ అభివృద్ధి చెందడానికి ఇటువంటి ఉత్సవాలు దోహదం చేస్తాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో రెక్టర్‌ ఆచార్య డి సూర్యచంద్రరావు, రిజిస్ట్రార్‌ డా పి వీర బ్రహ్మచారి, కృష్ణా తరంగ్‌ 2023 కన్వీనర్‌ డాక్టర్‌ ఎం.కోటేశ్వరరావు తదితరులు ప్రసంగించారు. తొలుత అతిథులు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య సుందర కృష్ణా, విశ్వవిద్యాలయ సభ్యులు మాధవి, సుభాషిణి, దినేష్‌లు పాల్గొనగా సభానంతరం అతిథులను సత్కరించారు. విద్యార్ధుల కేరింతల నడుమ కృష్ణా తరంగ్‌ 2023 ప్రారంభిస్తున్నట్లు హేమచంద్రరెడ్డి ప్రకటించారు డాక్టర్‌ విజయ కుమారీ సభాపరిచేయం చేయగా డాక్టర్‌ శ్రావణి వందన సమర్పణ చేశారు.

➡️