లో-ఓల్టేజి సమస్య పరిష్కారానికి ఏపీఈపీడీసీఎల్ ఈఈకి విన్నవించిన దాడి రత్నాకర్
ప్రజాశక్తి – కశింకోట : అనకాపల్లి మండలం పాపయ్యసంతపాలెంలో గ్రామంలో గత కొంతకాలంగా లో-ఓల్టేజ్ సమస్య ఉండడంతో గ్రామంలో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వారి సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని వైసీపీ పార్లమెంట్ పరిశీలకులు దాడి రత్నాకర్ కోరారు. ఈ మేరకు ఏపీఈపీడీసీఎల్ ఈఈ ఎస్.రామకృష్ణ ను కశింకోట కార్యాలయంలో కలిసి రత్నాకర్ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రత్నాకర్ మాట్లాడుతూ గ్రామంలో రైతులకు సంబంధించి సుమారు 70 నుంచి 80 వరకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌లు ఉన్నాయ. అయితే కొంతకాలంగా లో-ఓల్టేజి కారణంగా రైతులు పొలాల్లో ఏర్పాటు చేసుకున్న మోటార్లు కాలిపోతున్నాయి. మోటారు కనెక్షన్లకు సరిపడా విద్యుత్ సరఫరా చేసే సామర్థ్యంగల ట్రాన్స్‌ఫార్మర్ లేకపోవడంతో ఈ సమస్య తలెత్తుంది. దీంతో రైతులు తమ పంట పొలాలలకు నీరు అందకపోవడంతో వేసిన పంటలన్నీ పోయి తీవ్రనష్టానికి గురయ్యారు. కావున దీనిని దృష్టిలో ఉంచుకొని తక్షణమే ఇక్కడ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి అదనపు ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే గ్రామంలో గల ఇళ్లకు సంబంధించి కూడా లో-వోల్టేజి సమస్య అధికంగా ఉండడంతో గ్రామ ప్రజలు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లవద్ద వాడే వివిధ రకాల విద్యుత్ పరికరాలు లో`వోల్టేజి కారణంగా కాలిపోతున్నాయి. లో-ఓల్టేజి కారణంగా ఇళ్లలో వినియోగించే ఏ విద్యుత్ పరికరం కూడా సక్రమంగా పనిచేయక పోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ రామకృష్ణ మాట్లాడుతూ సమస్య పరిష్కారం చేస్తనని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు మొల్లిటి సత్తి బాబు, ఎస్ వెంకట అప్పారావు పాల్గొన్నారు.