ప్రజాశక్తి – పెద్దాపురం : స్థానిక జవహర్లాల్ నెహ్రూ మున్సిపల్ హైస్కూల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్నం భోజనం నాణ్యతను మరింత పెంచాలని ఎస్ఎఫ్ఐ మండల కమిటీ విజ్ఞప్తి చేసింది. శుక్రవారం విద్యార్థుల అభ్యర్థన మేరకు ఎస్ఎఫ్ఐ బృందం విద్యార్థులకు అందజేసిన భోజనాన్ని పరిశీలించింది. అనంతరం వారు మాట్లాడుతూ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా విద్యార్థులకు ఈ భోజనాన్ని సరఫరా చేస్తున్నారన్నారు. భోజనం చాలా నాసిరకంగా ఉందన్నారు.అధికారులు పరిశీలనకు వస్తారని తెలిసిన రెండు రోజులపాటు భోజనం బాగుంటుందని మిగిలిన రోజుల్లో మామూలేనని వారు తెలిపారు. భోజనం బాగుండకపోవడంతో చాలామంది విద్యార్థులు స్కూల్లో భోజనం చేయడం లేదని ఇళ్లకు వెళ్లిపోతున్నారన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ హైస్కూల్లో నాణ్యమైన భోజనాన్ని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల నాయకులు వై గోపాల్,బి జగదీష్,జి రాజు తదితరులు పాల్గొన్నారు.