మార్పు కోసం లక్షలాది మందితో భారీ సభ
దళిత, కాపు నేతల స్పష్టీకరణ
ప్రజాశక్తి-కాకినాడ : బడుగు, బలహీన వర్గాల ఆశయాల కోసం దివంగత వంగవీటి మోహన రంగా తీవ్రంగా కృషి చేశారని ఆయన ఆశయాలు రంగానాడు తోనే సాధ్యమవుతాయంటూ పలువురు దళిత, కాపు వర్గాలకు చెందిన నాయకులు వెల్లడించారు. దివంగత వంగవీటి రంగ 36వ వర్ధంతి పురస్కరించుకొని వచ్చేనెల డిసెంబర్ 26వ తేదీన కాకినాడలోని ఏడిబి రోడ్లో ఉన్న కార్యాలయం వద్ద లక్షలాది మందితో భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వారు చెప్పారు. గతంలో విశాఖ, విజయవాడ, గుంటూరు వంటి ప్రాంతాలలో రంగా లేదా కాపునాడు పేర్లతో కార్యక్రమాలు ప్రారంభించామని ఈసారి నుంచి అందరికీ మేలు జరగాలని లక్ష్యంతో రంగానాడు అనే పేరుతో కార్యక్రమాలను చేయనున్నట్లు వారు చెప్పారు. బుధవారం కాకినాడలోని జిఆర్టి గ్రాండ్ హోటల్లో రాధా రంగా రాయల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రంగానాడు అనే కార్యక్రమానికి సంబంధించి వివరాలను అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు మంచాల సాయి సుధాకర్ నాయుడు, అధ్యక్షుడు గాదే బాలాజీలు వెల్లడించారు.
ఈ సందర్భంగా సుధాకర్, బాలాజీలు మాట్లాడుతూ కులాల ఐక్యత కోసం, సమాజ శ్రేయస్సు కోసం రంగా బడుగుల తరఫున పనిచేశారన్నారు. నాడు ఆయన తన కులం కాకుండా ఇతర దళిత, బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల ఆశయాలు కోసం ఆశించిన రీతిలో పనిచేసి రంగా మన్ననలు పొందారన్నారు. ఆయన జైల్లో ఉండగా కాపునాడు అనే సంస్థను ప్రారంభించి కార్యక్రమాలు చేపట్టారని ప్రస్తుతం ఆ పేరుతో కాకుండా రంగా నాడు అనే పేరుతో అందరికీ మేలు చేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టామన్నారు. రంగా ఎస్సీల కోసం వారి హక్కుల కోసం నిరాహార దీక్ష చేస్తే ఆయన్ని తుదముట్టించారన్నారు. దగాపడ్డ అన్ని వర్గాల వారికి ఈ రంగానాడు సహకరిస్తుందని, మార్పు కోసమే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. డిసెంబర్ 26న జరిగే కార్యక్రమానికి మంద కృష్ణ మాదిగ, ఆర్ కృష్ణయ్య, జాతీయ దళిత నాయకుడు రాజశేఖర్లతోపాటు రాష్ట్రంలో ఉన్న వివిధ వర్గాలకు చెందిన కాపు, ఇతర నాయకులను ఆహ్వానిస్తామని వారు చెప్పారు. రంగా ఆశయాల కోసం ఈ రంగానాడు పనిచేసి అన్ని వర్గాల వారి ప్రయోజనాల కోసం మద్దతు సాధిస్తుందని సుధాకర్ నాయుడు, బాలాజీలు వివరించారు. ఈ కార్యక్రమానికి కన్వీనర్ గా ములకల చంటిబాబు వ్యవహరిస్తారన్నారు. ఇంకా ఈ సమావేశంలో దళిత నాయకుడు బచ్చల కామేశ్వరరావు, నాయకులు వాదా ప్రసాద్ రావు, జానపాముల నాగబాబు, రాజారపు మహేష్, బొజ్జ ఐశ్వర్య, తుమ్మల శ్రీరామ్మూర్తి, సలాది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.