రాజ్యాంగ పరిరక్షణే అంబేద్కర్‌కు నివాళి

Nov 26,2023 15:29 #Kakinada

ప్రజాశక్తి కాకినాడ : భారత రాజ్యాంగాన్ని పరిరక్షించడమే అంబేద్కర్‌కు ఇచ్చే ఘనమైన నివాళి అని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కె. ప్రసన్నకుమార్‌ పేర్కొన్నారు. రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఆదివారం స్థానిక కచేరిపేట సుందరయ్య భవనం వద్ద ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కె. ప్రసన్నకుమార్‌ పూలమాలేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కే .ఎస్‌. శ్రీనివాస్‌, కెవిపిఎస్‌ సీనియర్‌ నాయకులు మోర్త రాజశేఖర్‌,సి ఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేష బాబ్జి మాట్లాడుతూ అంబేద్కర్‌ చేతిలో ఉన్న రాజ్యాంగమే దేశానికి పునాదిగా ఉందన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అంబేద్కర్‌ విగ్రహాలను ఏర్పాటు చేసి రాజ్యాంగాన్ని 125 అడుగుల పాతాళంలోకి తొక్కేస్తోందని విమర్శించారు. స్వాతంత్య్రం అనంతరం రాజ్యాంగాన్ని జాతికి అంకితం చేసిన రోజు నవంబర్‌ 26 అని చెప్పారు. దేశానికి పునాదిగా ఉన్న రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని చెప్పారు. దళితులు, ఆదివాసీలు వంటి అన్ని వర్గాల ప్రజల యొక్క భవిష్యత్తు ఈ పరిరక్షణపైనే ఆధారపడి ఉంటుందన్నారు. దేశంలో అంబేద్కర్‌కు ప్రాధాన్యత ఉందన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని కుల వ్యవస్థ భారతదేశంలో ఉందని, ఈ వ్యవస్థ పోవాలని అంబేద్కర్‌ కోరుకున్నారని చెప్పారు. అంబేద్కర్‌ జపం చేస్తున్న మనువాద మతోన్మాదులు కుల వ్యవస్థను ప్రోత్సాహిస్తున్నారని చెప్పారు. ఇప్పటికీ కులం పేరుతో దుర్మార్గాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్న చట్టాలు కాపాడటంలో పాలకులు విఫలమయ్యారని చెప్పారు. భారత రాజ్యాంగానికి ముప్పు వాటిల్లుతోందని, ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తాన్ని కార్పొరేట్‌ శక్తులకు అమ్ముతున్నారని తెలిపారు. రాజ్యాంగాన్ని, ప్రభుత్వం రంగ సంస్థలను కాపాడుకోవడంతో పాటు కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల సీనియర్‌ నాయకులు ఎం. కష్ణమూర్తి, బచ్చల కామేశ్వరరావు, తుమ్మల నూకరాజు కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి కే.సింహాచలం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు టేకుమూడీ ఈశ్వరరావు ఐద్వా రాష్ట్ర నాయకురాలు సిహెచ్‌ రమణి , సిఐటియు రూరల్‌ కన్వీనర్‌ టీ. రాజా, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వరహాలు, ఎం గంగసూరిబాబు , కెవిపిఎస్‌, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఊబ బుల్లబ్బాయి, అదష్టదీపుడు, కె. సత్యానందం, పద్మనాభం తదితరులు పాల్గొన్నారు.

➡️