మిర్చిని వెంటాడుతున్న తెగుళ్లు

Nov 18,2023 12:44 #guntur, #mirchi

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : మిర్చి పైరుపై తెగుళ్లు దాడి పెరిగింది. నల్ల తామర పురుగు, జెమిని వైరస్‌ (బొబ్బర) ఉధృతం అవుతోంది. పల్నాడు, గుంటూరు జిల్లాలోని వివిధ మండలాల్లో తామర తెగులు గత నెలలోనే స్వల్పంగా ప్రారంభమైంది. ప్రధానంగా పల్నాడు జిల్లాలోని మాచర్ల, గురజాల, సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. తామర పురుగులను ఉద్యాన శాఖ అధికారులు గుర్తించారు. బొబ్బర తెగులు ప్రభావంతో ఆకు ముడత వస్తోంది. కొన్ని ప్రాంతాల్లో కొమ్మకుళ్లు తెగులు ఆశిస్తోంది. మిర్చి పంట జులై, ఆగస్టు నెలల్లోనే సాగు చేసిన ప్రాంతాల్లో తెగులు ప్రభావం ఎక్కువగా ఉంది. తెగులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇక పైరు నిలబడదని గ్రహించి రైతులు పైరు మొత్తాన్ని దున్నేస్తున్నారు.
ప్రస్తుతం వాణిజ్య పంటల్లో మిర్చికి బాగా గిరాకి ఉంది. నాలుగేళ్లుగా క్వింటాళ్‌కు రూ.15 వేల వరకు లభిస్తుండటంతో ఎన్ని ఇబ్బందులెదురైనా మిర్చి సాగుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. ఎంత ఇబ్బంది వచ్చినా ఎకరాకు 10 క్వింటాళ్లు తగ్గకుండా వస్తుంది. అన్ని పరిస్థితులు అనుకూలిస్తే 20 నుంచి 30 క్వింటాళ్ల కూడా సాధిస్తున్నారు. అయితే ఈ ఏడాది సాగు ఆరంభం నుంచి రైతులకు ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. మిర్చి మొక్కకు రూ.2 నుంచి రూ.3కు కొనుగోలు చేశారు. ప్రస్తుతం తొలి దశలో సాగు చేసిన ప్రాంతాల్లో పంట పూత, కాయదశల్లో ఉంది. ఈ నేపథ్యంలో తెగుళ్లు వెంటాడుతున్నాయి. ప్రధానంగా ఆకుముడత, బొబ్బర, కొమ్మకుళ్లు ఆశించి ఆకులన్నీ తినేస్తున్నాయి. చీడపీడల నివారణకు ఒక్కొ ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు పురుగు మందులను వినియోగిస్తున్నారు.
పెదకూరపాడు ప్రాంతంలోని లింగంగుంట్లలో కొంత మంది రైతులు తెగుళ్ల బారిన పడిన పంటను దున్నేశారు. అయితే సస్య రక్షణ చర్యలు చేపట్టాలని, మిర్చికి అనుబంధంగా జొన్న, మొక్క, జొన్న పైర్లు వేస్తే తెగుళ్ల బెడద నుంచి మిర్చి పైరును కాపాడుకోవచ్చునని వ్వవసాయ, ఉద్యాన శాఖాధికారులు చెబుతున్నారు. ప్రతి ఏటా మిర్చిపై బొబ్బర తెగుళ్లు వస్తున్నా శాస్త్రవేత్తలు శాశ్వత నివారణకు సూచనలు చేయలేకపోతున్నారు. మిర్చి పక్కన మరో పంట వేసుకోవాలనే సూచిస్తున్నారు. వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు కూడా తెగుళ్ల నివారణకు శాశ్వత పరిష్కారం కనుగొనలేకపోయారు.
మార్కెట్‌లో మిర్చి ధరలు ఆశాజనకంగా ఉండటం వల్ల వర్షాభావ పరిస్థితులు ఎదురవుతున్నా రైతులు ఎక్కువ రోజులు వేచిచూసే ధోరణిలో ఉన్నా చివరికి ఖరీఫ్‌ సీజన్‌ దాదాపుగా ముగింపు దశలో మిర్చివైపు మొగ్గు చూపారు. మిర్చికి ఎకరాకు కనీసం రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. తెగుళ్ల ప్రభావం అధికమైతే మరో రూ.50 వేలు అదనంగా ఖర్చు అవుతుంది. బొబ్బర, ఆకుముడత, తెల్లదోమ, తామర పురుగుల ఉధృతి తగ్గించడానికి ఎకరానికి జిగురు రాసిన పసుపు, నీలిరంగు అట్టలను 30 నుంచి 40 అట్టలను పెట్టుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. బొబ్బర, తామర తెగులు నివారణకు వేప నూనె వినియోగించాలన్నారు. అదేవిధంగా 10 రోజులకు వేప నూనెకు బదులు గానుగ నూనెను కలిపి పొలానికి పిచికారి చేయాలన్నారు. ఇందువల్ల రసంపిల్చే, లద్దె పురుగు లార్వా కొసస్థ దశలు కుడా నివారించవచ్చని చెబుతున్నారు.

➡️