కార్మికుల హక్కుల కోసం తుది వరకు పోరాడిన డేవిడ్‌ సంస్మరణ సభలో పలువురు వక్తలు

Nov 21,2023 22:47 #ntr district

 

ప్రజాశక్తి – విజయవాడ : అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా తుది వరకు తన జీవితాన్ని మునిసిపల్‌ కార్మికోద్యమానికి, సిపిఎంకు ధారపోసిన ధన్యజీవి, పోరాట యోధుడని పలువురు నాయకులు పేర్కొన్నారు. మునిసిపల్‌ కార్పొరేషన్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) నగర కార్యదర్శి మన్నెం డేవిడ్‌ సంస్మరణ సభ స్థానిక మాకినేని బసవపున్నయ్య భవన్‌లో మంగళవారం జరిగింది. ముందుగా డేవిడ్‌ చిత్రపటానికి సిఐటియు రాష్ట్ర నాయకులు చిగురుపాటి బాబూరావు, యూనియన్‌ నగర గౌరవాధ్యక్షులు దోనేపూడి కాశీనాథ్‌, ఇతర నాయకులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించి, సంతాప సూచికగా సభ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు మునిసిపల్‌ కార్పొరేషన్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నగర అధ్యక్షులు ఎస్‌.జ్యోతిబాస్‌ అధ్యక్షత వహించారు. సభనుద్దేశించి బాబూరావు మాట్లాడుతూ అనేక ఆటుపోట్ల ఎదుర్కొంటూనే మునిసిపల్‌ కార్మికుల హక్కుల కోసం, యూనియన్‌ బలోపేతానికి, ఎర్రజెండా నీడన చివరి వరకు పోరాడిన డేవిడ్‌ జీవితం ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. శ్రమకు తగిన వేతనం రావాలని రూ.1800 నుంచి ఇతర అలవెన్స్‌తో కలుపుకొని రూ. 21 వేల వరకు మునిసిపల్‌ కార్మికులకు వేతనాల పెరిగాయంటే …ఎర్రజెండా…డేవిడ్‌ లాంటి నాయకులు, కార్యకర్తల కృషి దాగి ఉందని అన్నారు. యూనియన్‌ గౌరవాధ్యక్షులు దోనేపూడి కాశీనాధ్‌ మాట్లాడుతూ…నిరంతరం కార్మికుల సమస్యలపై పని చేస్తూనే మునిసిపల్‌ యూనియన్‌ బలోపేతానికి డేవిడ్‌ ఎప్పుడూ ముందుండేవాడని, ఆయన లేని లోటు తీర్చలేనిదని అన్నారు. సిఐటి యు ఎన్‌టిఆర్‌ జిల్లా ప్రధాన కార్య దర్శి ఎన్‌సిహెచ్‌. శ్రీనివాస్‌ మాట్లా డుతూ మునిసిపల్‌ కార్మికులతో పాటు ఆయా రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగ, కార్మికుల సమస్యలపై జరగనున్న సమరశీల పోరాటాలకు కార్మికులు సన్నద్దమవ్వడమే డేవిడ్‌కు అర్పించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కె.శ్రీదేవి, సెంట్రల్‌ సిటీ కమిటీ కార్యదర్శి భూపతి రమణారావు, కార్యదర్శివర్గ సభ్యులు కె.దుర్గారావు, పశ్చిమ సిటీ కమిటీ కార్యదర్శి, సిపిఎం ప్లోర్‌లీడర్‌ బోయి సత్యబాబు, తూర్పు సిటీ కమిటీ కార్యదర్శివర్గ సభ్యులు పి కృష్ణ, శ్రామిక మహిళా సంఘం జిల్లా కార్యదర్శి ఎ కమల, సిఐటియు సెంట్రల్‌సిటీ కమిటీ కార్యదర్శి ఎంవి సుధాకర్‌, యూనియన్‌ నాయకులు టి ప్రవీణ్‌, రాజధాని ప్రాంత మునిసిపల్‌ యూనియన్‌ నాయకులు రవి, డేవిడ్‌ భార్య బుజ్జమ్మ, యూనియన్‌ నాయకులు పాల్గొన్నారు.

➡️