సాగునీటి విడుదలకు మందే పనులు

Nov 18,2023 13:30 #collector, #Kakinada

ప్రజాశక్తి-కాకినాడ : జిల్లాలో నీటి పారుదల వ్యవస్థ మెరుగుదలకు, పంపిణీ సమస్యల నివారణకు ప్రతిపాదించిన పనులన్నిటినీ రబీ సాగునీటి విడుదలకు మందే యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ కోర్టు హాల్లో రబీ-2023-24 కార్యాచరణపై కలెక్టర్‌ వ్యవసాయ, ఇరిగేషన్‌, డ్రెయిన్స్‌, మత్స్య, గ్రామీణ నీటి సరఫరా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇటీవల జరిగిన జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో జరిపిన చర్చల కనుగుణంగా రబీ-2023-24 సీజన్‌లో వివిధ సాగునీటి వ్యవస్థల కింద చేపట్టగలిగిన వరి, అపరాల పంటల విస్తీర్ణంపై వ్యవసాయ శాఖ జెడి ఎన్‌.విజయకుమార్‌, ఇరిగేషన్‌ ఎస్‌ఇ జి.శ్రీనివాసరావు కలెక్టరుకు నివేదిక సమర్పించారు. ఈ రబీలో జిల్లాలోని గోదావరి కాలవల క్రింద 1,24,798 ఎకరాల పూర్తి ఆయకట్టులోను, ఏలేరు వ్యవస్థలోని 44,250 ఎకరాల విస్తీర్ణంలోను వరి సాగుకు, ఏలేరు వ్యవస్థలో హైపాచ్‌ ప్రాంతాల్లోని 8,767 ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగుకు వ్యవసాయ, ఇరిగేషన్‌ శాఖలు ఉమ్మడిగా ప్రతిపాదించాయి. ఈ మేరకు అన్ని మండలాలు, ఆర్బికేల పరిధిలో నీటి యాజమాన్య కమిటీల సమావేశాలు నిర్వహించి రబీ సాగునీటి సరఫరా ప్రణాళికను, ఆయా పంటలకు సానుకూలతపై వివరించామని జెడిఎ వివరించారు. కలెక్టర్‌ కృతికా శుక్లా సమీక్షిస్తూ రబీ సాగునీటి సరఫరాకు అవరోధాలు లేకుండా నివారించేందుకు డిఎంఎఫ్‌ నిధులతో ప్రతిపాదించిన పనులన్నిటినీ నీటి పంపిణీ ప్రారంభించేలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.ఇలక్కియ, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎస్‌ఇ ఎం.శ్రీనివాస్‌, ఫిషరీస్‌ జెడి పి.సత్యన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.

➡️