20 వేల మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు : ఎంపి

Nov 21,2023 21:12 #Tirupati district

 

20 వేల మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు : ఎంపి
వర్షం కారణంగా తడలో సిఎం పర్యటన రద్దు
ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో, తడ :  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమాన భాగస్వామ్యంతో రూ.94.75 కోట్ల నిధులతో ఇసుకమేట తొలగింపు పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని, దీంతో సుమారు 20 వేల మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు విరజిమ్మనున్నాయని తిరుపతి ఎంపీ డాక్టర్‌ మద్దిల గురుమూర్తి చెప్పారు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో సీఎం వైఎస్‌ జగన్‌ మంగళవారం నాటి సూళ్లూరుపేట పర్యటన రద్దయింది. అయితే మత్స్యకారులకు సాయం అందించే కార్యక్రమం మాత్రం వాయిదా పడలేదు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో నెల్లూరు కలెక్టర్‌ కార్యాలయం నుంచి తిరుపతి ఎంపీ గురుమూర్తి పాల్గొన్నారు.
ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఎంపీ మాట్లాడుతూ ఓఎన్జీసీ సంస్ధ పైప్‌లైన్‌ పనుల కారణంగా జీవనోపాధి కోల్పోయిన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని 23,458 మంది మత్స్యకార కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వ చొరవతో ఓఎన్జీసీ ద్వారా నాలుగో విడతగా ఒక్కొక్కరికి నెలకు రూ.11,500 చొప్పున 6 నెలలకుగానూ రూ.69,000, మొత్తం రూ.161.86 కోట్ల ఆర్ధిక సాయాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి సీఎం జగన్మోహన్‌ రెడ్డి జమ చేయడం సంతోషకరమన్నారు. దాదాపు రెండు దశాబ్దాలుగా వేలాది మంది మత్స్యకార కుటుంబాలకు ఇబ్బందిగా తయారైన పులికాట్‌ సరస్సు ముఖద్వారం పూడిక సమస్య ఎట్టకేలకు త్వరలో పరిష్కారం కానుందని తెలిపారు.
సియం పర్యటన రద్దు
ఎడ తెరప లేని వర్షం కారణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సూళ్లూరుపేట నియోజకవర్గం పర్యటన రద్దయింది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట లోని మాంబట్టు వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు చేశారు. మత్స్యకార దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి బహిరంగ సభలో పాల్గొని ఈ ప్రాంత మత్యకారుల అభివద్ధి కోసం 150 కోట్ల రూపాయలతో కొన్ని ప్రత్యేక అభివద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయాల్సి వుంది. కానీ సోమవారం రాత్రి నుండి కురుస్తున్న వర్షం కారణంగా నాయకులు, అధికారులు ముఖ్యమంత్రి పర్యటనను రద్దు అయినట్లు ప్రకటించారు.

 

➡️