ప్రజాశక్తి – బద్వేలు రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మెగా డిఎస్‌సి నోటిఫికేషన్ తక్షణమే విడుదల చేయాలని, లేకపోతే భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువతి యువకులను కలుపుకొని ఆందోళన చేపడుతామని డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని తెలిపారు. డివైఎఫ్‌ఐ బద్వేల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సుధా, బద్వేల్ రెవెన్యూ డివిజన్ అధికారి వెంకటరమణకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్‌ఐ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆరు లక్షలు పైగా నిరుద్యోగులు బిఇడి, టిటిసి పూర్తి చేసి కోచింగ్ తీసుకుని ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేస్తుందా అని ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు సంవత్సరాలుగా నిరాశే మిగిల్చిందని, కనీసం ఇప్పుడైనా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 25 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయాలని కోరారు. అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో ఒక్క డిఎస్‌సి నోటిఫికేషన్ ఇవ్వని ఏకైక ప్రభుత్వం వైసిపినే అన్నారు. ఖాళీలతో సంబంధం లేకుండా విద్యాశాఖ మంత్రి మాత్రం నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని వారు విమర్శించారు. పార్లమెంటులో చెప్పిన లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 40 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఇప్పటికే రాష్ట్రంలో 8 వేలకు పైగా ఏ కో ఉపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయని తెలిపారు. 1.88 లక్షల ఉపాధ్యాయులు ఉండాల్సిన చోట ఇప్పుడు కేవలం 1.69 మంది ఉపాధ్యాయులు మాత్రమే పని చేస్తున్నారని వాపోయారు. జనవరిలో వేలాదిమంది ఉపాధ్యాయులు రిటైర్మెంట్ అవుతున్నారని తెలిపారు. రేషన లైజేషన్ పేరుతో 10 వేల ఉపాధ్యాయ పోస్టులను రద్దుచేసిందని తెలిపారు తెలుగు మీడియం తీసివేసి మరో 15వేల ఉపాధ్యాయ పోస్టులను రద్దు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. నూతన విద్యా విధానం 20 20 పేరుతో 5 వేల పాఠశాలలు మూసివేసిందని, ఈ ప్రభుత్వానికి నిరుద్యోగ యువతీ యువకుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే వెంటనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి ప్రక్రియను పూర్తి చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో డివైఎఫ్‌ఐ బద్వేల్ పట్టణ అధ్యక్షుడు ఎస్.కె. మస్తాన్ షరీఫ్, పట్టణ ట్రెజరర్ పీ సురేంద్ర, పట్టణ నాయకులు ఓబుల్ రెడ్డి, ఇమ్మానేలు పాల్గొన్నారు.