ప్రజాశక్తి-బాపట్ల : కవిత్రయం అంటే తిక్కన, వేమన, గురజాడ అని శ్రీశ్రీ అన్నారని అదే విధంగా గురజాడ అభ్యుదయ కవితా పితామహునిగా తెలుగు సాహితీ జగత్తులో శాశ్వతంగా నిలిచిపోయారని రావూరి నరసింహ వర్మ పేర్కొన్నారు. సాహితీ భారతి ఆధ్వర్యంలో జరిగిన గురుజాడ అప్పారావు 108వ వర్ధంతి సభకు రావూరి నరసింహ వర్మ అధ్యక్షత వహించారు. గిడుగు రామమూర్తితో కలిసి గురజాడ తెలుగు వ్యవహారిక భాష ప్రచారానికి కృషి చేశారన్నారు. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అనే గేయంతో ప్రజల్లో స్ఫూర్తిని కలిగించారన్నారు. సాహితీ భారతి ఉపాధ్యక్షులు మర్రి మాల్యాద్రి రావు మాట్లాడుతూ గురజాడ సాహిత్యం అనే ఆయుధంతో మూఢవిశ్వాసాలను రూపుమాపటానికి నిరంతర పోరాటం చేశారన్నారు. వారు రచించిన కన్యాశుల్కం నాటకం నేటికీ ప్రజాదరణ పొందుతూనే ఉందన్నారు. పుత్తడి బొమ్మ పూర్ణమ్మ గేయ కావ్యం నేటికీ ఆంధ్రులను ఆకట్టుకుంటూనే ఉంటుందన్నారు. సాహితీ భారతి కోశాధికారి ఆదం షఫీ మాట్లాడుతూ కన్యాశుల్కం నాటకం ఇంగ్లీషు రష్యన్ ఫ్రెంచ్ హిందీ తమిళం కన్నడం తదితర భాషల్లో కూడా అనువదింపబడినదనన్నారు. ఈ సభలో ఎన్ కృష్ణ అబ్దుల్ ఖాదర్ జీలాని ఎం జాకబ్ కస్తూరి శ్రీనివాసరావు బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి పువ్వాడ వెంకటేశ్వర్లు రెంటాల మురళి రాధాకృష్ణమూర్తి అవ్వారి వెంకటేశ్వర్లు తదితరులు గురజాడ అప్పారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.