రైతులకు తోడ్పాటునందించాలి

Nov 18,2023 12:55 #anakapalle district, #farmers

ప్రజాశక్తి-అనకాపల్లి : జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా తగిన తోడ్పాటునందించాలని జిల్లా కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి వ్యవసాయ, సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతుకు ఆదాయం వచ్చే విధంగా ఇతర వ్యవసాయ సంబంధిత మార్గాలను తెలియజేయాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతు సమస్యలపై లోతుగా దృష్టి సారించాలని సూచించారు. వ్యవసాయం, మత్స్య, ఉద్యానవన, బిందు సేద్యం, నీటిపారుదల శాఖలపై సమీక్షించారు. జిల్లాలో రైతులకు సబ్సిడీ రుణాలు అందించాలని, వ్యవసాయ సహకార బ్యాంకు అధికారులు రైతులకు ఇచ్చే రుణాలను గూర్చి పూర్తి అవగాహన కల్పించాలని ఆదేశించారు. జిల్లాలో పంటల పరిస్థితులను, వివిధ రిజర్వాయర్లలో నీటి లభ్యతలనుగూర్చి వివిధ శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. బోర్లు, నీటి వనరులు ఉన్న ప్రాంతాలలో ఆరుతడి పంటలను ప్రోత్సహించాలని సూచించారు. రైతు భరోసా కేంద్రాల వారీగా పశు దాణా ఆవశ్యకతను గుర్తించి తదనుగుణంగా అవసరమైన దాణాకు సంబంధించి ఇప్పటినుంచే ప్రణాళిక తయారు చేయాలన్నారు. అదనపు ఆదాయాన్నిచ్చే పాడి, మత్స్య, ఉద్యానవన, కోళ్లు మేకల పెంపకం మొదలైన వాటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. రైతులు పండించిన పంటకు తగిన మద్దతు ధర వచ్చే విధంగా ధాన్యం సేకరణకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. బిందు సేద్యం తుంపర సేద్యం ద్వారా కాయగూరలను పండించడంపై మరింత మంది రైతులకు అవగాహన కలిగించి ప్రోత్సహించాలన్నారు.
వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు చిక్కాల రామారావు మాట్లాడుతూ జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున అనకాపల్లి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలన్నారు. ఈ విషయమై ఆయన సలహా మండలి సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించినట్లు చెప్పారు. ఇప్పటికే రైతులు వరి పంట నష్టపోయారని ఉద్యానవన రైతులకు కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పాడి, స్వల్పకాలిక పంటల ద్వారా రైతుకు సంబంధించిన మార్గాల ద్వారా ఆదాయాలు పొందే విధంగా వివిధ శాఖల అధికారులు రైతులకు సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ బి.స్మరణ రాజ్‌, సలహా మండలి సభ్యులు ఎస్‌.రమణ, జి.ఆనందరావు, వి.అచ్చం నాయుడు, ఆర్‌.గంగునాయుడు, జిల్లా వ్యవసాయ అధికారి మోహనరావు, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్‌ ప్రసాదరావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ప్రభాకర్‌రావు, డిసిసిబి మేనేజర్‌ వర్మ, మత్స్య శాఖ అధికారి లక్ష్మణమూర్తి, పౌరసరఫరాల డిఎం జయంతి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

➡️