మహేంద్ర మృతికి నిరసనగా ధర్నా

Nov 18,2023 13:33
  • హోం మంత్రి రాజీనామా చేయాలి.. సిపిఎం, సిపిఐ నాయకుల డిమాండ్‌

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి : దళిత యువకుడు బొంతు మహేంద్ర మృతికి నిరసనగా సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో నగరంలోని శ్యామలాసెంటర్‌ వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు మహేంద్ర మృతికి కారకులను కఠినంగా శిక్షించాలని, నైతిక బాధ్యత వహిస్తూ హోం మంత్రి రాజీనామా చేయాలని, మహేంద్ర మృతిపై సమగ్ర విచారణ చేయాలని, బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని నినదించారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్ళులు టి.అరుణ్‌, తాటిపాక మధు మాట్లాడారు. కొవ్వూరు మండలం దొమ్మేరులో ఫ్లెక్సీ వివాదం నేపథ్యంలో బొంతు మహేంద్రను ఈనెల 13న కొవ్వూరు ఎస్‌ఐ భూషణం స్వయంగా పోలీస్‌ స్టేషన్‌ తీసుకెళ్లాడని కుటుంబ సభ్యులు చెబుతున్నార న్నారు. స్టేషన్‌కు తీసుకెళ్లి అవమానించడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడన్నారు. ఈ నేపథ్యంలో మహేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. హోం మంత్రి సొంత నియోజకవర్గంలోనే దళితులకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ హోం మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్నడూ లేనంతగా తూర్పుగోదావరి జిల్లాలోనే దళితులపై ఎక్కువగా దాడులు జరుగుతున్నాయన్నారు. మృతుని కుటుంబానికి కనీసం రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న ప్రజాసంఘాలు, ప్రతిపక్ష పార్టీల నాయకులను గృహనిర్బంధం చేయడం దారుణమన్నారు. అధికార పార్టీలోని దళిత నాయకులే రక్షణ లేకపోవడం శోచనీయమన్నారు. ఈ ధర్నాలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కుండ్రపు రాంబాబు, నగర కార్యదర్శి, వి.కొండలరావు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాజులోవ, సీనియర్‌ నాయకులు ఎస్‌ఎస్‌.మూర్తి, జట్టు కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి సప్ప రమణ, అధికార పార్టీ సభ్యులు ఆర్‌.వెంకట్రావు జి.వెంకట్రావు కాళ్ల అప్పలనాయుడు, నల్ల రామారావు మహిళా సమాఖ్య జిల్లా కో కన్వీనర్‌ ఎం.ముత్యాలు, ఎఐఎస్‌ఎఫ్‌ నగర కన్వీనర్‌ ఎం.స్టాలిన్‌, సిపిఎం నాయకులు ఐ.సుబ్రహ్మణ్యం, వి.రాంబాబు, బి.రామకృష్ణ, సోమేశ్వరావు, రుద్ర, రాజు, తదితరులు పాల్గొన్నారు.

➡️