కార్మికులకు కనీసవేతనం 26 వేలు చెల్లించాలి
ప్రజాశక్తి-కాకినాడ : నవంబరు 27, 28 విజయవాడ జింఖానా గ్రౌండ్స్ లో జరిగే మహాధర్నాని జయప్రదం చేయాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాలు, ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో కాకినాడ కలక్టరేట్ వద్ద జెండా ఊపి ఆటో ప్రచారజాతాని సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు జి. బేబీరాణి ప్రారంభించి మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం 9ఏళ్ల పాలనలో రైతాంగ సంక్షోభం పెరిగి ప్రతి 20 నిమిషాలకు ఒక రైతు దేశంలో ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు. కార్పొరేట్ మోడీ స్నేహితులకు లాభం చేకూర్చేందుకు కార్మికుల హక్కులన్నింటిని తొలగిస్తూ బానిసలుగా మార్చేందుకు 44 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చారని విమర్శించారు. తక్షణం రైతులను సంక్షోభం నుంచి బయటపడేందుకు రైతుల పంటలకు గిట్టుబాటు ధర చట్టం చేయాలని, ఏ రంగంలో పనిచేసే కార్మికులకైనా కనీస వేతనం 26000 తగ్గకుండా నిర్ణయించి చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 90శాతం వ్యవసాయ భూమిలో కౌలు రైతులు పనిచేస్తున్నారని, జగన్ ప్రభుత్వం కనీసం గుర్తింపు కార్డులు కూడా మంజూరు చేయలేదని, బ్యాంకు రుణాలు అందక కౌలు రైతులు దళారీల చేతిలో బందీలుగామారి అప్పులపాలయి ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు. క్షేత్రస్థాయిలో పంటలు పండించేందుకు కష్టపడే రైతాంగానికి, కౌలు రైతులకు బేషరతుగా రుణాలు అందించాలని, పండించిన పంటలన్నీ ప్రభుత్వమే పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, ఐ ఎన్ టి యు సి ఏపీ అండ్ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్లూరు రాజు మాట్లాడుతూ పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు తక్షణం చర్యలు చేపట్టి కార్మికుల ప్రాణాలు కాపాడాలని, అన్ని పరిశ్రమల్లో పీఎఫ్ ఈఎస్ఐ కార్మిక చట్టాలను అమలు చేయాలని అమలు చేయని యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో యుక్తవయసు ఉన్న యువకులలో నిరుద్యోగం 26 శాతానికి పెరిగిపోయిందని, తక్షణం ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్న 18 లక్షల పోస్టులను నిరుద్యోగులతో భర్తీ చేయాలన్నారు పై డిమాండ్లపై జరిగే నవంబర్ 27 28 విజయవాడ మహాధర్నాకు రైతులు, కౌలు రైతులు, కార్మికులు, ఉద్యోగులు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాధర్నాను విజయవంతం చేయడం ద్వారా డిమాండ్లు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దువ్వ శేషబాబ్జి, చెక్కల రాజ్ కుమార్, జిల్లా కోశాధికారి మలకా వెంకటరమణ, సిఐటియు నాయకులు మేడిశెట్టి వెంకటరమణ, తొట్టిపూడి రాజా, ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నర్ల ఈశ్వరి, చంద్రమళ్ల పద్మ, నగర అధ్యక్షులు పలివెల వీరబాబు, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు జ్యోతి, నాగూర్, దేవి, ఏఐసీసీ టి యు రాష్ట్ర కన్వీనర్ గొడుగు సత్యనారాయణ, నరసరాజు, రైతుసంఘం జిల్లా అధ్యక్షులు తిరుమలశెట్టి నాగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పప్పు ఆదినారాయణ, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ నరాల శివ, రాణి, చంద్రరారావు తదితరులు పాల్గొన్నారు.