ప్రజాశక్తి-రామచంద్రపురం(కోనసీమ) : విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో గల మత్స్యకారుల కుటుంబాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని నియోజకవర్గ బీసీ సేన అధ్యక్షులు యాట్ల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో దురదృష్టవశాత్తు భారీ అగ్ని ప్రమాదం జరిగి 44 ఫిషింగ్ బోట్లు కాలి బూడిదవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో బోట్ పై 25 నుండి 30 కుటుంబాలు ఆధారపడి జీవితం సాగిస్తున్నారనీ, వీరందరికి బోట్లు జీవనాధారం అని తెలిపారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం ముందు ఇటువంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరమని అన్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. మత్స్యకారులను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని ఆర్థిక సహాయం అందించాలని ఆయన కోరారు.